04-03-2025 07:45:54 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మ్యాతరి సతీష్(42)కు గత 17 సంవత్సరాల క్రితం గౌరారం గ్రామానికి చెందిన అనితతో వివాహం జరిగినది. ఇతనికి ఇద్దరు కుమారులు సంతానం ఉన్నారు. సతీష్ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారని అయితే ఇటీవల కాలం నుండి భార్యాభర్తలకు మధ్య విభేదాలు రావడంతో తరచూ చిన్న చిన్న గొడవలు జరిగేవని, సోమవారం కూడా ఇంట్లో గొడవ జరిగిందని అదే క్రమంలో మంగళవారం ఉదయం సతీష్ చెట్టుకు ఉరి వేసుకుని కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అందించారని, మృతుని తల్లి పద్మ తన కుమారుడి మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని విచారణ అనంతరం పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.