21-04-2025 11:47:19 PM
పాపన్నపేట: ఆర్థిక ఇబ్బందులతో పురుగు మందు సేవించి చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని బాచారం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన ప్రకారం వివరాలు...గ్రామానికి చెందిన రావుగారి ఆంజనేయులు(40) గత కొన్నేళ్లుగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొన్నేళ్ల కిందట ఇంద్రేశంలో రేకుల ఇళ్లు నిర్మించుకున్నాడు. ఇంటి నిర్మాణం కోసం కొంత అప్పు అయింది.
ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో మద్యానికి బానిసగా మారాడు. ఈ నెల 19న గ్రామంలో బంధువుల ఫంక్షన్ లో పాల్గొనేందుకు గ్రామానికి వచ్చాడు. అదే రోజు సాయంత్రం గ్రామ శివారులోనీ చేను వద్ద పురుగు మందు సేవించాడు. అటుగా వెళ్లిన వారు గమనించి చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం గాంధీకి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు కూతురు, ఇద్దరు కుమారులు, ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.