23-04-2025 04:57:14 PM
కామారెడ్డి (విజయక్రాంతి): ఇంటర్ ఫస్టియర్ లో ఫెయిల్ అయ్యానని మనస్తాపానికి గురైన పూజ(17) అనే విద్యార్థిని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భిక్కనూర్ మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. తల్లిదండ్రులు లేకపోవడంతో నానమ్మతో పాటు ఉంటున్న పూజ కామారెడ్డిలోని ఆర్యభట్ట జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదివింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో పూజ ఫెయిల్ అయ్యింది. అదే రోజు నానమ్మ ఊరిలో లేకపోవడంతో దగ్గరలోనే ఉన్న తన పెద్ద ఇంటికి వెళ్లి పూజ నిద్రించింది. ఆ సందర్భంలో తాను ఫెయిల్ అయ్యానని తన పెద్దకు చెబుతూ పూజ రోదించగా, పర్వాలేదు మళ్లీ పరీక్షలు రాస్తే పాసవుతావని ఆమె ధైర్యం చెప్పింది.
ఆ తరువాత ఇద్దరు నిద్రించారు. బుధవారం తెల్లవారుజామున నిద్రలేచిన పూజ ఇల్లు, వాకిలి ఊడ్చి వస్తానని తన పెద్దమ్మకు చెప్పి వెళ్లింది. ఎంతకీ రాకపోవడంతో ఆమె పెద్దమ్మ ఇంటికి వెళ్లి చూడగా పూజ ఆత్మహత్య చేసుకుని కనిపించడంతో ఆమె బోరున విలపించింది. పూజ నిప్పంటించుకోవడంతో అక్కడే ఉన్న ఆమె పుస్తకాలు సైతం దగ్ధమయ్యాయి. నాన్న చనిపోగా, తల్లి వదిలేసి వెళ్లడంతో పూజ తన నానమ్మ వద్ద ఉంటోంది. మనవరాలు తనను ఒంటరిని చేసి వెళ్లిపోయిందని పూజ నానమ్మ రోదించడం అక్కడ ఉన్న వారిని కలిచివేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.