దౌల్తాబాద్: ఇంటి కోసం ప్రైవేట్ బ్యాంకులో తీసుకున్న రుణం తీర్చలేక తీవ్ర మనస్తాపం చెంది వ్యక్తి మృతి చెందిన సంఘటన దౌల్తాబాద్ మండలం కోనాపూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. దౌల్తాబాద్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన తుమ్మల సత్యనారాయణ (41) హమాలి పనిచేస్తూ జీవనం సాగిస్తుంటారు. మూడు సంవత్సరాల క్రితం ఐఐఎఫ్ఎల్ ప్రైవేట్ ఫైనాన్స్ సిద్దిపేట బ్యాంకు నుంచి రూ.16 లక్షల ఇంటి రుణం తీసుకున్నారు. ఈ ఋణం చెల్లించడానికి ప్రతి నెల రూ.22 వేల వాయిదా చొప్పున చెల్లించాలి. అయితే గత కొద్ది నెలల నుంచి నెలవారి ఈఎంఐ చెల్లించడం లేదు.
దీనితో ఐఐఎఫ్ఎల్ ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంకు వారు దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఇంటికి వచ్చి ఈ యొక్క ఇల్లు ఐఐఎఫ్ఎల్ ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంకుకు చెందినదని ఇంటి గోడకు రాసి వెళ్లారు. దానితో ఇంటి అప్పు తీర్చే మార్గం కనబడక సత్యనారాయణ తీవ్రమనస్థాపం చెందాడు. అలాగే సత్యనారాయణ భార్య రేణుక తల్లిదండ్రుల నుంచి మరికొన్ని డబ్బులు రావాల్సి ఉండగా సమయానికి వారు కూడా ఇవ్వకపోవడంతో అప్పుల విషయంలో భార్యా భర్తలకు బుధవారం రాత్రి గొడవ జరిగింది. దీనితో సత్యనారాయణ మరింత మనస్థాపానికి గురై ఇంటి అప్పులు తీర్చే మార్గం కనబడకపోవడంతో జీవితంపై విరక్తి చెంది అత్తగారి గ్రామమైన కోనాపూర్ వెళ్లి వారి వ్యవసాయ పొలంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో, వారు వెళ్లి చూసేసరికి సత్యనారాయణ మృతి చెందాడు. పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య రేణుక కుమారులు జశ్వంత్, అజయ్ ఉన్నారు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దౌల్తాబాద్ ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్ తెలిపారు.