శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్‌లో దారుణం చోటుచేసుకున్నది. ఓ గుర్తు తెలియని వ్యక్తి(35)ని హంతకులు ఇటుక రాయితో తలపై మోది దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్(Miyapur Police Station) పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి హఫీజ్ పెట్ రైల్వే స్టేషన్(Hafizpet Railway Station) వద్ద గుర్తు తెలియని వ్యక్తిని ఇటుక రాయితో తలపై మోది దారుణంగా హత్య చేశారు. కాగా ఆదివారం చుట్టుపక్కల స్థానికులు చూసి మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి ఎవరు అనే కోణంలో ఆరా తీయగా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మియాపూర్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.