01-04-2025 02:15:09 AM
ఎల్బీనగర్, మార్చి 31: కర్మన్ ఘాట్ జానకి ఎన్ క్లేవ్లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. సరూర్ నగర్ పోలీసుల వివరాల ప్రకారం, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడి గ్రామానికి చెందిన బచ్చు వెంకటేశ్వర్లు అలియాస్ రాజు (47) కొన్నేళ్లుగా కర్మన్ ఘాట్లోని జానకి ఎన్క్లేవ్లో నివసిస్తున్నాడు. డైలీ ఫైనాన్స్ ఇస్తూ జీవనం సాగిస్తున్న వెంకటేశ్వర్లు వివాహం అయిన కొన్ని రోజులకే భార్యతో విడిపోయాడు.
సూర్యాపేట జిల్లా శ్రీనివాసపురం గ్రామానికి చెందిన మామిడి గురువమ్మ, భర్త మృతి చెందడంతో తన కొడుకు, కూతురితో కలిసి కర్మన్ ఘాట్లో నివాసం ఉంటోంది. గత 10 నెలలుగా వెంకటేశ్వర్లు గురువమ్మతో సహజీవనం చేస్తున్నాడు. గురువమ్మ తన కొడుకు, కూతురును మరో చోట అద్దె ఇంట్లో ఉంచింది. ఉగాది పండుగ సందర్భంగా గురువమ్మ కొడుకు, కూతురు జానకి ఎన్క్లేవ్కు వచ్చారు. వెంకటేశ్వర్లు గురువమ్మతో పాటు ఆమె కొడుకు, కూతురిని ప్రతిరోజూ అసభ్యకరమైన పదజాలంతో దూషించేవాడు.
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ముగ్గురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాత్రి 12:40 గంటల సమయంలో వెంకటేశ్వర్లు పోలీసులకు ఫోన్ చేసి, గురువమ్మ కొడుకు పవన్ తనపై దాడి చేస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి పవన్ కత్తితో వెంకటేశ్వర్లు ఎడమ భుజం, కడుపు, ఛాతీపై పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు.
వెంటనే పోలీసులు గాయపడిన వెంకటేశ్వర్లును 108 అంబులెన్స్ ద్వారా ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సరూర్ నగర్ సీఐ సైదిరెడ్డి తెలిపారు.