12-02-2025 02:03:32 AM
కరీంనగర్, ఫిబ్రవరి11 (విజయక్రాంతి): చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ను గత సెప్టెంబర్ నెలలో బెదిరింపులకు పాల్పడి, 20 లక్షల రూపాయల డిమాండ్ చేసిన వ్యక్తి ని అరెస్ట్ చేసి, రిమాండు చేసిన కరీంనగర్ రూరల్ ఏఎస్పీ శుభం ప్రకాష్ . బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన కొత్తపల్లి పోలీసులు. నిందితుడు లండన్ లో ఉన్నట్లు విచారణ లో తేలగా గత అక్టోబర్ నెలలో లుక్ అవుట్ సర్కులర్ జారీ చేసిన అప్పటి కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ.
కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మేడిపల్లి సత్యం గత సెప్టెంబర్ నెలలో 28వ తేదీన మధ్యాహ్నం మరియు రాత్రి సమయాల్లో అతనికి తెలియని నెంబర్ +447886696497 నుండి వాట్సాప్ ద్వారా ఫోన్ కాల్ వచ్చిందని,
అందులో నిందితుడు కాల్ లో మాట్లాడుతూ తనకు 20 లక్షల రూపాయలు చెల్లించాలని లేనిెుడల తనను రాజకీయంగా అప్రతిష్టపాలు చేసి తన గౌరవానికి భంగం కలిగే చర్యలకు పాల్పడతానని మరియు తన ఇద్దరు పిల్లలను అనాధలు అయ్యేలా చేస్తానని బెదిరింపులకు గురిచేసినట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొత్తపల్లి పోలీస్ స్టేషన్ నందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 339/2024 , భారతీయ న్యాయ సంహింత 308, 351(3), (4) , Sec 3(1)(r)(s),3(2) (va) of SCs & STs (POA) A సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కేసు పై విచారణ జరిపిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి లభించిన ఆధారాల ద్వారా నిందితుడు రంగారెడ్డి జిల్లా బోడుప్పల్ లోని భవానినగర్ కి చెందిన యాస అఖిలేష్ రెడ్డి (33) అని, ఇతడు ప్రస్తుతం లండన్ లో ఉన్నాడని, అక్కడినుండి బెదిరింపులకు పాల్పడ్డాడని తేలిందని సదరు నిందితుడిపై బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా లుక్ అవుట్ సర్కులర్ జారీ చేశామని అప్పటి కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపిన విషయం విదితమే.
ఇదిలా ఉండగా నిందితుడు ఈ నెల 9వ తేదీ కర్ణాటక లోని బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నాడని, అది గమనించిన కర్ణాటక ఇమ్మిగ్రేషన్ అథారిటీ అఫ్ బెంగళూర్ అధికారులు నిందితుడైన యాస అఖిలేష్ రెడ్డి (33)ని అదుపులోకి తీసుకుని కొత్తపల్లి ఎస్సు కి సమాచారమిచ్చారు.
ఎస్సు కొత్తపల్లి వెంటనే బయలుదేరి అక్కడికి చేరుకొని బెంగళూరు ఇమ్మిగ్రేషన్ అథారిటీ అధికారులను కలిసి నిందితుడిని సోమవారంనాడు అదుపులోకి తీసుకుని కరీంనగర్ తీసుకొచ్చామని కరీంనగర్ రూరల్ ఏఎస్పీ శుభం ప్రకాష్ ఐపీఎస్ తెలిపారు.
నిందితుడిని కోర్ట్ లో హాజరు పరచగా గౌరవ మేజిస్ట్రేట్ నిందితుడికి రిమాండ్ విధించగా కరీంనగర్ జైలుకు తరలించారు. సోషల్ మీడియా వేదికగా ఎవరినైనా బెదిరింపులకు పాల్పడిన, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసిన చట్టప్రకారం కఠిన చర్యలు చేపడతామని కరీంనగర్ రూరల్ ఏసిపి శుభం ప్రకాష్ ఐప తెలిపారు.