19-04-2025 09:39:08 AM
గురుగ్రామ్: హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (Intensive Care Unit)లో చికిత్స పొందుతున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఏప్రిల్ 6న జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం, ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్న 46 ఏళ్ల మహిళ అనారోగ్యానికి గురైన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో చేర్పించారు.
ఆమె ఐసియులో చికిత్స పొందుతుండగా ఏప్రిల్ 6న ఒక యువకుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని ప్రతిఘటించలేపోయింది. ఏప్రిల్ 13న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆ మహిళ తన భర్తకు జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె భర్త ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె దాడి వివరాలను వివరిస్తూ ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో ఆమె ఆరోగ్య పరిస్థితి కారణంగా దాడిని ఆపలేకపోయానని ఆ మహిళ పోలీసులకు తెలిపింది. సంఘటన సమయంలో ఇద్దరు నర్సులు ఐసియులో ఉన్నారని, కానీ జోక్యం చేసుకోలేదని కూడా ఆమె పేర్కొంది. ఆమె ఫిర్యాదు ఆధారంగా ఏప్రిల్ 14న సదర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీనియర్ పోలీసు అధికారులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి ఈ సంఘటనను దర్యాప్తు చేయడానికి ఎనిమిది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (Special Investigation Team) ఏర్పాటు చేశారు.
రంగంలోకి దిగిన సిట్ ఆసుపత్రిలోని సుమారు 800 సీసీటీవీ ఫుటేజ్ క్లిప్‌లను పరిశీలించి, నేరస్థుడిని గుర్తించడానికి ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించింది. దర్యాప్తులో సిట్ నిందితుడిని దీపక్ అని గుర్తించింది. విచారణలో, నిందితుడు గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీలో బ్యాచిలర్ పూర్తి చేసిన తర్వాత ఐదు నెలల క్రితం మేదాంతలో చేరినట్లు వెల్లడించాడని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. దీపక్ బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలోని బధౌలి గ్రామానికి చెందినవాడు. దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి, ఆసుపత్రి సిబ్బందిని విచారించి, వివిధ వాస్తవాలను పరిశోధించిన తర్వాత నిందితుడిని గుర్తించామని పోలీసులు తెలిపారు. తదుపరి చర్యల కోసం నిందితుడిని శనివారం కోర్టు ముందు హాజరుపరుస్తామని, దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.