22-04-2025 01:11:15 AM
పటాన్ చెరు, ఏప్రిల్ 21 :ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పటాన్ చెరు పోలీసులు అరెస్టు చేశారు. దొంగిలించిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. వివరాలను పటాన్ చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి సోమవారం వెల్లడించారు.
చందానగర్ పాపిరెడ్డి కాలనీకి చెందిన శివరాత్రి దివాకర్ (23) గత కొన్ని నెలలుగా ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నాడు. గతంలో సిద్దిపేట, గుమ్మడిదల, రామచంద్రాపురం, చందానగర్, దుండిగల్, ఐడిఏ బొల్లారం, టపాఛబుత్రా తో పాటు పలు ప్రాంతాలలో దొంగతనాలు చేసి 20 కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. నెలరోజుల్లో పటాన్ చెరు పరిధిలో రెండు దొంగతనాలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడు శివరాత్రి దివాకర్ ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. నిందితుని నుంచి 3.5 తులాల బంగారం, 15 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ వినాయక రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాజు, ఏఎస్‌ఐ రాజు, పోలీస్ సిబ్బంది బాలరాజు, సుకేష్ రెడ్డి, సాయి, అంజి లను డీఎస్పీ అభినందించారు.