03-03-2025 01:32:32 AM
విమానాశ్రయంతో మారనున్న వరంగల్ రూపురేఖలు
హైదరాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): రెండున్నరేళ్లలో మామునూర్ ఎయిర్‌పోర్ట్ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని కవాడిగూడ కేంద్ర ప్రభు త్వ కార్యాలయాల సముదాయంలో ఆదివారం కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మామునూర్ ఎయిర్‌పోర్ట్‌కు గతంలో ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్ట్‌గా పేరుండేదన్నారు. మళ్లీ అంతపేరు తెచ్చే విధంగా ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తామని ప్రకటించారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పు లు వచ్చాయని కొనియాడారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టక ముందు దేశవ్యాప్తంగా 74 ఎయిర్‌పోర్ట్‌లు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 150కి పెరిగిందని స్పష్టం చేశారు.
చిన్న చిన్న నగరాల్లోనూ ఇప్పుడు విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. వరంగల్ వంటి పెద్ద నగరానికి ఎయిర్‌పోర్ట్ వస్తే బాగుంటుందన్నారు. ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు 2,800 మీటర్ల రన్ వే అవసరమని, అందుకు 280 ఎకరాల భూమి అదనంగా కావాల్సి ఉందన్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి ప్రతిపాదనలు పంపించామన్నారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎన్వోసీ తీసుకొని క్లియరెన్స్ సైతం ఇచ్చామన్నారు. విమానాశ్రయ ఏర్పాటుతో వరం గంల్ ప్రాంత రూపురేఖలు మారతాయని ఆకాంక్షించారు. ఎయిర్‌పోర్టులు నిర్మించేది ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని రాష్ర్టప్రభుత్వాలు కాదంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి చురకలంటించారు.
రాష్ర్ట ప్రభుత్వం కేవలం భూసే కరణ మాత్రమే చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేనాటికి సర్ ప్లస్ రాష్ట్రమని, ఇప్పుడు అదే రాష్ట్రం అప్పుల పాలైందని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని సీఎం నిలబెట్టుకోవాలన్నారు. తాము మామునూర్ ఎయిర్‌పోర్ట్ హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు.
సీఎం త్వరగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తే బాగుంటుందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం, నిజామాబాద్‌లోనూ ఎయిర్‌పోర్టులు నిర్మించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సాంకేతిక బృందం సర్వే చేస్తున్న దన్నారు.
కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఒకచోట స్థలం పరిశీలించామనిర కానీ ఆ స్థలం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అనుకూలంగా లేదన్నారు. దీంతో మరోచోట స్థలం ప్రతిపాదించామన్నారు.
ఉడాన్ స్కీంను అనుసంధానిస్తాం..: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
మామునూర్ విమానాశ్రయాన్ని ఉడాన్ స్కీంకు అనుసంధానం చేస్తామని, తద్వారా కమర్షియల్ ఆపరేషన్స్‌కు కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందుతాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. చారిత్రక వరంగల్ నగరంలో విమానయాన సేవలు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఎయిర్ పోర్ట్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు.
స్వాతంత్య్రానికి ముందు ఈ ఎయిర్‌పోర్ట్ దేశంలోనే అతిపెద్దదన్నారు. అంతటి చరిత్ర ఉన్న విమానా శ్రయానికి పునర్వుభైవం తీసుకొస్తామన్నారు. కొత్తగూడెం, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి ద్వితీయశ్రేణి నగరాల్లోనూ విమానయాన సదుపా యాలు కల్పించేందుకు కేంద్రం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.