- హైదరాబాద్‌కు దీటుగా మహానగరమై వెలుగొందాలి..
- భూసేకరణ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): ఓరుగల్లు రూపురేఖలు మారేలా మామునూరు విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. తద్వారా హైదరాబాద్‌కు దీటుగా ఓరుగల్లు మహానగరమై వెలుగొందాలని ఆకాంక్షించారు.
విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణతో పాటు ఇతర ప్రణాళికలపై గురువారం హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడారు. దక్షిణ కొరియాతోపాటు ఎన్నో దేశాలు ఎయిర్‌పోర్ట్‌లు నిర్మిం చి, వాటి ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు.
ఇదే కోవలో మామునూరు విమానాశ్రయం సైతం ఉండాలని సూచించారు. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లను విమానాశ్రయానికి అనుసంధానంగా నిర్మించాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల ప్రజలు భవిష్యత్‌లో మామునూరు విమానాశ్రయం నుంచే రాకపోకలకు సాగించేలా రహదారులు ఉండాలన్నారు.
మున్ముందు టెక్స్‌టైల్స్, ఐటీ, ఫార్మా తదితర పరిశ్రమలు వచ్చేందుకు బాటలు వేయాలని సూచించారు. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే మేడారం జాతరతోపాటు లక్నవరం, రామప్పతో పాటు ఇతర పర్యాటక ప్రదేశాలకు సందర్శకుల తాకిడి పెరుగుతుందన్నారు.
సమీక్షలో ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కె.జయవీర్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, వరంగల్ కలెక్టర్ సత్యశారద, వరంగల్ ఆర్డీవో సత్యపాల్‌రెడ్డి పాల్గొన్నారు.