22-03-2025 04:59:31 PM
దొరికిన ఫోన్ ను బాధితులకు అందజేత..
అదనపు ఎస్పీ ఎ. సంజీవరావ్..
సంగారెడ్డి (విజయక్రాంతి): నిజాయితీగా దొరికిన సెల్ ఫోన్ గురించి వివరాలను సేకరించి, తిరిగి బాధితులకు అందించడంలో మమత నిజాయితీని చాటుకుందని అదనపు ఎస్పీ సంజీవరావు కానిస్టేబుల్ మమత ను అభినందించారు. శుక్రవారం మధ్యహ్నం 1.30 గంటల సమయంలో మమత ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ ఐ.టి. సెల్ లో విధులు ముగించుకోని లంచ్ విరామంలో ఇంటికి వెళుతుండగా ఐ.టి.ఐ బస్ స్టాండ్ వద్ద ఒక ఫోన్ కనిపించిందని తెలిపారు.
టెక్నికల్ సపోర్ట్ తో అట్టి ఫోన్ యొక్క యజమాని వివరాలను సేకరించి శనివారం అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్ చేతుల మీదుగా బాధితులకు అందించడం జరిగింది. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండలం, నర్సాపూర్ తాండాకు చెందిన బాబ్య సొంత పని మీద సంగారెడ్డి పట్టణానికి వచ్చి, తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఐ.టి.ఐ బస్ స్టాండ్ వద్ద బస్సు ఎక్కి పోవడం జరిగిందని తెలిపారు. అదే సమయంలో అటువైపు నుంచి వెళుతున్న మహిళా కానిస్టేబుల్ కు ఫోన్ కనిపించడం జరిగింది. రోడ్డుపై దొరికిన ఫోన్ ఎవరిదో సమాచారం తెలుసుకుని వారికి అప్పగించారు.