న్యూఢిల్లీ: రాజ్యాంగం పై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. రాజ్యాంగ చర్చపై రాజ్యసభలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. బీజేపీపై విమర్శలు గుప్పించారు. విభజన సూత్రాన్ని బీజేపీ నమ్ముతుందని చెప్పారు. మనకు స్వేచ్ఛ, సమానత్వం కావాలని తెలిపారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆరోపించారు. నెహ్రూ, ఇందిరాగాంధీని బీజేపీ కించపరుస్తోందని మండిపడ్డారు. దేశం కోసం ఎప్పుడూ పోరాటం చేయని బీజేపీ అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. బీజేపీ రాజ్యాంగానికి అనుకూలమా? వ్యతిరేకమా? అని ఖర్గే ప్రశ్నించారు. ప్రాథమిక సమస్యల పరిష్కారానికి బీజేపీకి ఆసక్తి లేదని ఖర్గే పేర్కొన్నారు.
1949లో ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే అది మనుస్మృతి ఆధారంగా లేదు... వారు రాజ్యాంగాన్ని లేదా త్రివర్ణాన్ని అంగీకరించలేదు. కోర్టు ఉత్తర్వు ఇవ్వడంతో 2002 జనవరి 26న మొదటిసారిగా బలవంతంగా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని మల్లికార్జున్ ఖర్గే గుర్తుచేశారు. మన వీర నాయకురాలు ఇందిరా గాంధీ పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేసి, బంగ్లాదేశ్‌ను విముక్తి చేసింది... ఈ దేశ గర్వం ప్రపంచమంతటా వ్యాపించింది. అక్కడ (బంగ్లాదేశ్‌లో) జరుగుతున్న గందరగోళం, కనీసం ఈ (బిజెపి) ప్రజలు కళ్లు తెరిచి అక్కడి మైనారిటీలను రక్షించడానికి ప్రయత్నించాలన్నారు. దేశం కోసం పోరాడని వారికి స్వేచ్ఛ, రాజ్యాంగం ప్రాముఖ్యత ఎలా తెలుస్తుంది?... ప్రధాని మనకు బోధిస్తున్నాడు. మేము అబద్ధాలు చెబుతాము కాని నంబర్ వన్ అబద్ధాలకోరు ప్రధానమంత్రి అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల ఖాతాల్లోకి రూ.15 లక్షలు వస్తాయని చెప్పినా ఏమీ రాలేదు... ఇంతమంది దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.. మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని బలోపేతం చేసేందుకు గత 11 ఏళ్లలో ఏం చేశారో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాలని మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు.