calender_icon.png 22 September, 2024 | 3:33 PM

నిండుకుండలా మల్లన్నసాగర్‌

22-09-2024 02:11:14 PM

దౌల్తాబాద్ (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లో 21.12 టీఎంసీల నీటిని నిల్వచేసి 2024-25 సీజన్‌ పంపింగ్‌ ముగించామని ప్రాజెక్టు డీఈఈ శ్రీనివాస్‌ తెలిపారు. ఇప్పటి వరకు 18.50 టీఎంసీల గోదావరి జలాలను మల్లన్నసాగర్‌లోకి పంపింగ్‌ చేశామని, దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారిందని ఆయన తెలిపారు.మల్లన్నసాగర్‌ నుంచి 5.5 టీఎంసీల నీటిని కొండపోచమ్మ సాగర్‌కు తరలించినట్లు తెలిపారు. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లో ఇంతకు ముందున్న 8.50 టీఎంసీల నీటికి అదనంగా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 13.00 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు ఆయన తెలిపారు.

2020లో మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లో తొలిసారిగా పంపింగ్‌ ప్రారంచామని, నాలుగేండ్లలో ఇప్పటివరకు మొత్తం 60.40 టీఎంసీల నీటిని ఎత్తిపోశామన్నారు. 12వ ప్యాకేజీలో దుబ్బాక కాలువ ద్వారా నాలుగేండ్లుగా గొలుసుకట్టు చెరువుల ద్వారా 95 చొప్పున ట్యాంకులు, చెక్‌డ్యామ్‌లు నింపి మొత్తం 7.45 టీఎంసీల నీటిని సరఫరా చేసినట్లు చెప్పారు. దుబ్బాక ప్రధాన కాలువ 46.675 కి.మీ పొడువు కలిగి ఉండి 16 డిస్ట్టిబ్యూటరీల నెట్‌వర్క్‌ను కలిగి ఉందని, వీటి మొత్తం పొడవు 103 కి.మీ అన్నారు. 12వ ప్యాకేజీలో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌ నియోజకవర్గాల్లోని 1,25,000 ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేందుకు రూపొందించబడిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతుల సహకారంతో డిస్టిబ్యూటరీ కాలువల పూర్తికి అవసరమైన భూసేకరణ చేపట్టి పూర్తి ఆయకట్టుకు నీరందించడానికి కృషిచేస్తామని డీఈఈ శ్రీనివాస్‌ తెలిపారు.