చేర్యాల (విజయక్రాంతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న ఆలయం ఆదివారం నాడు భక్తులతో కిటకిటలాడింది. భక్తులు కార్తీక మాసం సందర్భంగా ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారికి గంగ రేణు చెట్టు కింద పట్నం వేసి బోనం చెల్లించుకున్నారు. అదేవిధంగా కొండపై నెలకొన్న ఎల్లమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి, బోనం చెల్లించుకుని మొక్కులు నెరవేర్చుకున్నారు. గంగరేణి చెట్టు వద్ద, క్యూ లైన్ల వద్ద, రాజగోపురం ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ఉదయం ఆరు గంటలకు మొదలైన భక్తుల కోలాహలం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో బాలాజీతో పాటు సిబ్బంది అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.