- ఉత్సవాలను విజయవంతం చేయండి
- వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు
మహబూబాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రంలోని మల్లికార్జునస్వామి ఆలయ జాతర ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నట్టు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. ఈ నేపథ్యంలో జాతర నిర్వహణపై అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో వీడియో కాల్ ద్వారా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతర అభివృద్ధికి రూ.10 కోట్లు కావాలని కోరారు. మంత్రి సురేఖ మాట్లాడుతూ.. జాతరను విజయవంతంగా నిర్వహించాలన్నారు.
అనంతరం జాతరకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ మేయర్ సుధారాణి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు, కూడా చైర్మన్ ఎనకాల వెంకట్రామ్‌రెడ్డి, డీసీపీ రవీందర్, ఆర్డీవో రాథోడ్ రమేశ్, ఏసీపీ తిరుపతి, ఐనవోలు దేవస్థాన ఈవో నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.