12-03-2025 01:09:42 AM
గత ఏడాది కంటే రూ.11 లక్షల అదనం
చేర్యాల, మార్చి 11: ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి బుకింగ్ ఆదాయం రూ. 58 లక్షలు సమకూరిందని ఆలయ ఈవో కే రామాంజనేయులు తెలిపారు. వివిధ ఆర్జిత సేవలు అందించినందుకు గాను ఆదాయం సమకూరిందని ఆయన తెలిపారు. మల్లన్న ఆలయానికి గత రెండు వారాల నుంచి బుకింగ్ ఆదాయం పెరుగుతూ వస్తుంది. అంతకుముందు ఐదారు వారాలు గతంతో పోలిస్తే ఆదాయం తగ్గింది. మేడారం జాతర, కుంభమేళ తదితర కారణాల రీత్యా ఆదాయం తగ్గుతూ వచ్చింది. కుంభమేళా,మేడారం జాతరలు పరిసమాప్తం కావడంతో ఆదాయం పెరుగుతోంది. దీంతో ఆదాయం కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తుంది.
దీనితోపాటు ఉత్సవాలు కూడా దగ్గర పడడంతో మల్లన్న దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఆది సోమ వారాలను కలుపుకొని రూ.58 లక్షల 39 వేల 5 వందల 19 రూపాయలు ఆదాయం సమకూరింది. వివిధ ఆర్జిత సేవలతోపాటు, లడ్డు ప్రసాదం విక్రయం ద్వారా, వివిధ రకాల దర్శనాల ద్వారా ఈ ఆదాయం సమకూరింది. గత ఏడాది ఎనిమిదో వారం సందర్భంగా మూడు రోజులకు కలిపి రూ. 46 లక్షల 87 వేల 2 వందల 50 రూపాయల ఆదాయం సమకూరింది. ఈ లెక్కన గత ఏడాది కంటే ఈ ఏడాది రూ. 11 లక్షల 52 వేల 2 వందల 63 రూపాయలు అధికంగా చేకూరింది. వచ్చే రెండు వారాలు కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది.