calender_icon.png 31 October, 2024 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లం చెరువు కన్నీటి గాథ!

30-08-2024 02:09:50 AM

  1. నాడు విశాలమైన విస్తీర్ణంలో చెరువు 
  2. కబ్జాలతో ఇప్పుడు కట్టడాల మయం 
  3. శిఖంలో ఏకంగా కాలనీ 
  4. ఒకప్పుడు ఇది మంచినీటి వనరు 
  5. ఇప్పుడు మురికి కూపం 
  6. ఆయకట్టుకూ సాగునీరు బంద్

మెదక్, ఆగస్టు 29 (విజయక్రాంతి): ప్రజలరందరి దాహార్తిని తీర్చిన మల్లం చెరువు ఇప్పుడు కన్నీరు పెడుతోంది. కబ్జాకోరల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. జిల్లాకేంద్రానికి మంచినీటి వనరుగా ఉన్నఈ చెరువు ఇప్పుడు మురికి కుంటలా మారింది. 30 ఏళ్ల నుంచి కొంచెం కొంచెం చెప్పున ఇప్పుడు సగానికి పైగా అన్యాక్రాంతమైంది. రానున్న రోజుల్లో చెరువు అనే ఉనికిని సైతం కోల్పోయే ప్రమాదంలోకి వెళ్లింది. అధికారుల నిర్లక్ష్యం.. పాలకుల అలసత్వం.. కబ్జాదారులకు వరంగా మారింది.

అధికారిక లెక్కల ప్రకారం గతంలో చెరువు 31 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంతో ఉండేది. ప్రస్తుతం 15 ఎకరాలకు కుచించుకుపోయింది. చెరువు కింద 25 ఎకరాల ఆయకట్టు ఉండగా, ఇప్పుడా భూములకు సాగునీరు అందే పరిస్థితి లేదు. రాయిన్‌పల్లి చెరువు అలుగు ద్వారా ఈ చెరువు నిండేది. అప్పట్లో చెరువు ఊరికి దూరంగా ఉండడంతో మంచినీరు తెచ్చుకోవడానికి పట్టణవాసులు ఇబ్బంది పడేవారు. పట్టణ ప్రజలకు మంచినీరు సరఫరా చేసేందుకు ఇతర ప్రాంతాలకు చెందిన కూలీలు ఇక్కడి వచ్చి జీవనోపాధి పొందేవారు.

శిఖంలోనే కాలనీ..

చెరువు శిఖం ప్రస్తుతం ఉన్న ప్రధాన రోడ్డు వరకు ఉండేదని పట్టణానికి చెందిన సీనియర్ సిటిజన్స్ వెల్లడి స్తున్నారు. పాలకులు, ప్రభుత్వాలు మారినా అక్రమార్కు లకు అండగా నిలవడంతో కబ్జాకోరులకు చెరువును కబ్జా చేశారు. అలా ఇప్పుడక్కడ ఏకంగా రాంనగర్ పేరిట కాలనీ ఏర్పడింది. దశాబ్దాల నుంచి ఒక్కడ నివాసాలు ఉన్నాయి. గతంలో ఓ కలెక్టర్ ప్రత్యేకంగా చెరువును సర్వే చేయించి, చెరువు చుట్టూ ఫెన్సిం గ్ వేయించారు. కాలనీ నుంచి రోజుకు వందలాది గ్యాలన్ల మురుగు చెరువులో చేరుతోంది.

ఇలా చెరువు నీరు కలుషితమవుతున్నది. చెరువు అంచున చెత్తాచెదారం పేరుకోవడంతో దుర్గంధం వ్యాపిస్తున్నది. మున్సిపల్ అధికారులు గతంలో చెరువులోకి మురుగు చేరకుండా డ్రైన్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. టెండర్ ప్రక్రియకూ పూనుకున్నారు. కానీ ఆ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, చెరువును కబ్జా కోరల నుంచి కాపాడలని పట్టణవాసులు కోరుతున్నారు. 

ఆక్రమణలు గతంలోనే జరిగాయి

మెదక్ పట్టణంలోని మల్లం చెరువు ఆక్రమణలు ఇప్పటివి కావు. గడిచిన 30 ఏళ్ల నుంచి కబ్జాలు జరుగుతున్నాయి. గతంలో పనిచేసిన కలెక్టర్ ఆక్రమణలపై సర్వే చేయించి మళ్లీ పునరావృతం కాకుండా ఎఫ్‌టీఎల్ హద్దు నిర్ణయించారు. అప్పటి నుంచి ఎలాంటి ఆక్రమణలు లేవు. ఎవరైనా చెరువును ఆక్రమించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆక్రమణలు జరుగుతు న్నట్లు ఇప్పటివరకు మాకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. 

 శ్రీనివాసరావు,

ఈఈ, ఇరిగేషన్ శాఖ, మెదక్