calender_icon.png 20 November, 2024 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాల్స్ కార్మికులూ మనుషులే

28-06-2024 12:00:00 AM

షాపింగ్ మాల్స్‌లలో చాలామందికి ఉపాధి దొరుకుతుంది. కానీ, అక్కడ పనిచేస్తున్న వారి బతుకులు ‘తక్కువ వేతనం, ఎక్కువ వేదన’గా ఉంటున్నాయి. అక్కడి సేల్స్ వ్యక్తులు రోజుకి పది నుండి పన్నెండు గంటలు నిలబడే పనిచేస్తారు.  కేరళలో 2012లో కోజికోడ్‌లో ఒక షోరూంలో కస్టమర్లు షాపింగ్ చేస్తున్నప్పుడు అక్కడి సేల్స్ ఉమెన్ గోడకు చేరబడి ఉన్నందుకు ఆమె వేతనంలో యాజమాన్యం కోత విధించింది. ఈ పరిస్థితులలో పనిచేసే ప్రదేశం వద్ద కూర్చొనే హక్కు కలిగించాలని ఉద్యమం మొదలైంది.

గతంలో ‘కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్’ వెర్సెస్ ‘యూనియన్ ఆఫ్ ఇండియా’ విషయంలో సుప్రీంకోర్టు  ఒక కార్మికుని ఆరోగ్య హక్కు అనేది అర్థవంతమైన జీవించే హక్కులో అంతర్భాగమని, దృఢమైన ఆరోగ్యం, శక్తి లేకుంటే కార్మికుడు దుర్భర జీవితాన్ని గడుపుతాడని పేర్కొంది. ‘సి.ఇ.యస్.సి లిమిటెడ్’ వెర్సెస్ ‘సుభాష్ చంద్రబోస్’ 1992లో ఆరోగ్య హక్కు కార్మికులకు ప్రాథమిక మాన వ హక్కు అని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత ఆవశ్యకమైన రాజ్యాంగ లక్ష్యమని సుప్రీంకోర్టు పేర్కొంది. 

భారతదేశంలో కూర్చునే హక్కు ఉద్యమానికి కేరళకు చెందిన స్త్రీవాద కార్మిక సంఘం పెంకూట్టు నాయకత్వం వహించింది. ఈ సంఘాన్ని టైలర్ కార్యకర్తగా ఉన్న విజి పలితోడి స్థాపించారు. ఈ ఉద్యమం ఫలితంగా, కేరళ ప్రభుత్వం డిసెంబర్ 2018లో కేరళ షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్, 1960ని సవరించింది. పని చేసే మహిళలకు మరింత సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తూ కార్యాలయంలో వారి లైంగిక దోపిడీని నివారిస్తుంది. కేర ళ దుకాణం, ప్రతిస్థాపన చట్టంలో కొత్తగా 21బి ప్రవేశపెట్టారు. ఈ సెక్షన్ ప్రకారం  ప్రతి వ్యాపార దుకాణాలలో నిలబడి పనిచేసే పరిస్థితిని నివారించడానికి కార్మికులందరికీ కూర్చోవడానికి తగిన ఏర్పాట్లు చేయాలి.

సెప్టెంబరు 2021లో తమిళనాడు అసెంబ్లీ, సవరించిన తమిళనాడు దుకాణాలు స్థాపన చట్టం, 1947ను ఆమో దించింది. సెక్షన్ 22-ఎ ప్రకారం దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో సేల్స్‌మేన్, పని చేసే సిబ్బందికి తప్పనిసరిగా సీటింగ్ సౌకర్యం కల్పించాలి. సెప్టెంబరు 2021లో తమిళనాడు, ఇలాంటి చట్టాన్ని ఆమోదించిన ‘రెండవ భారతీయ రాష్ట్రం’గా అవతరించింది. ఈ సవరణలు ఇతర రాష్ట్రాల్లోని కార్మికులు భవిష్యత్తులో తమ రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఇలాంటి సవరణలను డిమాండ్ చేయడానికి మార్గం సుగమం చేశాయి. దేశంలోని ప్రతీ రాష్ట్రం ఇటువంటి చట్ట సవరణలు తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంది. 

జనక మోహన రావు దుంగ