calender_icon.png 8 April, 2025 | 1:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమంలో తిరిగి ఆగమైనం!

06-04-2025 12:00:00 AM

‘తెలంగాణ ఉద్యమం కోసం ఒక తరం జీవితాన్ని ధారపోసింది. బంగారు భవిష్యత్తును తాకట్టు పెట్టింది. ఇందుకు ప్రత్యక్ష సాక్షిని నేనే. స్వరాష్ట్ర సాధన కోసం 2001 మే 1న జల దృశ్యంలో కేసీఆర్ పార్టీని ప్రారంభించిన రోజునే టీఆర్‌ఎస్‌లో చేరా. ఉద్యమ సమయంలో 50కి పైగా కేసులు.. నిర్బంధాలను ఎదుర్కొన్నా. నాపై ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో బైండోవర్ కేసులు నమోదయ్యాయి. సమైక్య పాలకులు పెట్టిన కుట్ర కేసులో జైలు జీవితం గడిపాను’ అంటున్నారు మలిదశ ఉద్యమకారుడు సయ్యద్ అన్సార్.  

2014లో సొంతరాష్ట్రం ఏర్పడ్డ తరువాత కేసీఆర్ ప్రభుత్వ హయంలో నాపై ఉన్న కేసులను ప్రభుత్వ ఆదేశాలతో కొట్టివేశారు. ఉద్యమసమయంలో నేను వ్యాపారం చేస్తున్న వర్క్‌షాపు పార్టీ కార్యాలయంగా మారింది. అక్కడే ఉద్యమకార్యచరణపై పార్టీ శ్రేణులు, తెలంగాణ వాదుల చర్చలు జరుగుతుండేవి. ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా పనిచేశాను. దీంతో ఆర్థికంగా బలపడాల్సిన సమయంలో విలువైన జీవితాన్ని, సమయాన్ని కోల్పోయాను. పిల్లల భవిష్యత్తును కూడా ఆలోచించకుండా ఉద్యమంలో పాల్గొన్నాను. 

ఆర్థికంగా నష్టపోయా.. 

స్వరాష్ట్ర సాధనలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిన మలిదశ ఉద్యమంలో ప్రజలను సంఘటితం చేసేందుకు అన్సార్ ఎంతో కృషి చేశారు. ఆయన వృత్తిపరంగా రాణిస్తున్న రంగం ఆటోమొబైల్. ఆ రంగానికి సంబంధించిన డ్రైవర్లు, ఓనర్లను ఏకం చేయడంతోపాటు ఉద్యమంలో పాల్గొనేల కృషి చేశారు. జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆసిఫాబాద్ కేంద్రంగా చేపట్టిన వంటావార్పు, రహదారి నిర్బంధాలు ఇలా అనేక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. రాష్ట్రం సిద్ధించేదాక ప్రతి పోరాటంలో పాల్గొన్నారు. ఏ రోజూ వెనుకడుగు వేయలేదు. ఉద్యమ సమయంలో వ్యాపారాన్ని పక్కనపెట్టడంతో ఆర్థికంగా తీవ్రమైన నష్టాన్ని చవిచూశారు. ఆర్థికంగా మాత్రమే కాదు.. ఆరోగ్యపరకంగా కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. 

పార్టీని వీడలేదు.. 

టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న ఆయన ఉద్యమ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. పోలీస్ కేసులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. రాష్ట్ర సాధనే ధ్యేయంగా పోరాటం చేశారు. రాష్ట్రసాధన తరువాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలోనూ ఆయన ఎలాంటి లబ్ధిపొందలేదు. ఉద్యమకాలంలో పోరాటం చేసిన నాయకులకు న్యాయం చేయలేదనే భావన ఉన్నప్పటికీ అభిమానంతో ఇప్పటికీ పార్టీలోనే కొనసాగుతున్నారు. 

స్వరాష్ట్రమే లక్ష్యంగా..

చిన్నప్పటి నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావాలని కోరిక ఉండేది. 2001లో కేసీఆర్ ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్టీలో చేరా. అప్పటి నుంచి పార్టీ ఆదేశాల మేరకు పనిచేశాను. ఉద్యమ సమయం మొదట్లో పార్టీ కార్యకర్తలకు అంతంత మాత్రమే గుర్తింపు ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో పోలీసుల వేధింపులతో పార్టీలో చేరేందుకు కూడా భయపడేవాళ్లం. అలాంటి సమయంలో పార్టీని పట్టుకొని ఉద్యమంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఎంతో కృషిచేశాను. ఉద్యమాల ఫలితంగా తెలంగాణ సాధించుకున్నాం. ఆరోజు నాలాంటి వారు ఎందరో కుటుంబాన్ని, జీవితాన్ని త్యాగం చేసినందుకే ఇవాళ స్వరాష్ట్రంలో మన ఉనికిని చాటుకుంటున్నాం. ఇప్పటికి ఒక్కటే బాధేస్తుంది. తెలంగాణ వచ్చాక.. ఉద్యమకారులు గుర్తింపునకు నోచుకోకపోవడం బాధాకరం. 

 -అన్సార్, మలి ఉద్యమకారుడు

మా నోట్ల మన్ను పోశారు..  

తెలంగాణ వస్తే నిధులు, నియమాకాలు జరుగుతాయని ఎంతో ఆశతో పోరాటం చేసినం. రాష్ట్రం వచ్చిన తరువాత ఉద్యమకారుల నోట్ల మన్ను పోశారు. తెలంగాణ కోసం కేసులకు భయపడకుండా పోరాటం చేసినం. పన్నెండేళ్లు కోర్టుల చుట్టూ తిరిగినం. విధులకు హాజరు కాకుండా పోరాటం చేస్తే అప్పటి అధికారులు నోటిసులు ఇచ్చి భయపెట్టారు. అయినా ఉద్యమాన్ని వీడలేదు. ఆ సమయంలో కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, కవితలను కలిసేందుకు వెళితే ఎంతో అప్యాయంగా మాట్లాడారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులను విస్మరించారు. ఆసిఫాబాద్ డిపో టీఎంయూ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన నాకే సముచిత న్యాయం జరగలేదు. అలాంటిది సామాన్య ఉద్యమకారులకు ఎలా న్యాయం జరుగుతుంది. రాష్ట్రం ఏర్పడ్డాక నాకు రాజకీయంగా నామినేటేడ్ పదవి కావాలని.. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌ను కలిసేందుకు వెళ్తే అపాయింట్‌మెంట్ కూడా దొరకలేదు. లేఖలు రాసినప్పటికీ స్పందన లేకుండా పోయింది. పోరాటం చేసినోళ్ల నోట్లో మన్ను పోశారు. ఉద్యమకారులను రాష్ట్రస్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకూ ఎదుగనివ్వలేదు. ఈ ప్రభుత్వం అయినా నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి.

-వెంకటేశ్వర్లు, ఆర్టీసీ కార్మికుడు

మాకు అన్యాయం జరిగింది!

తెలంగాణ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రతి పల్లె ఉద్యమ బాట పట్టింది. కానీ, తెలంగాణ వచ్చిన తరువాత తుమ్మిడిహెట్టి వద్ద కట్టాల్సిన ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించి అక్కడ ప్రాజెక్టు కట్టడంతో మా జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. వ్యవసాయం కుంటుపడింది. రాష్ట్రం వచ్చినప్పటికి రైతాంగం ఎక్కవ శాతం నీటి లభ్యత లేక ఒక్క పంటకే పరిమితం అవుతున్నారు. నేను వ్యవసాయాన్ని వదిలి హైదరాబాద్‌లో ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నా. కేసీఆర్ రాష్ట్రంలో రైతాంగానికి మేలు చేసినప్పటికి మాకు మాత్రం అన్యాయం చేశాడు. ఉద్యమసమయంలో మమ్మల్ని పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లి రాత్రి, పగలు అక్కడే ఉంచితే ఇంట్లో వాళ్లు భయపడేది. రాష్ట్రం సిద్ధించిన తరువాత ఎన్నో మార్పులు జరిగినప్పటికి పెద్దగా ప్రజలకు లాభం జరిగనట్లు కనిపించడం లేదు. 

 -గంగారాం, చిన్నరాస్‌పల్లి  కుమ్రంభీం ఆసిఫాబాద్