calender_icon.png 24 December, 2024 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మలేషియా’ పెట్టుబడులకు ప్రోత్సాహం

24-12-2024 02:13:17 AM

డ్రైపోర్ట్‌ల నిర్మాణంలో భాగస్వాములు కావాలి

ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

 హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణలో అనుకూల వాతావరణం నెలకొల్పామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. గత నెలలో మలేషియా తెలుగు మహాసభలకు హాజరైన సందర్భంగా శ్రీధర్‌బాబును కలిసిన అక్కడి పారిశ్రామికవేత్తలు, మంత్రి పిలుపు మేరకు రాష్ర్ట పర్యటనకు వచ్చారు.

ఈ సందర్భంగా సచివాలయంలో దాదాపు 20 మంది మలేషియా వాణిజ్య ప్రతినిధులు సోమవారం మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, మలేషియా ద్వుపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగుపర్చడం, పామాయిల్ సేద్యంలో సహకరించడం, పర్యాటక రంగంలో పెట్టుబడులు, సహకారం వంటి అంశాలను మంత్రులు ప్రతినిధి బృందానికి వివరించారు.

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కూడా ఇక్కడ అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయని శ్రీధర్‌బాబు వెల్లడించారు. హుస్సేన్‌సాగ ర్ జలాశయంలో పూడికతీత, మురుగు నీటిని శుద్ధి చేయడంలో అత్యాధునిక సీవరేజ్ ప్లాంట్ల ఏర్పాటులో పాలుపంచుకోవాలని కోరారు.  కిన్నెరసాని, శ్రీశైలం బ్యాక్ వాటర్స్‌ను పర్యాటక ఆకర్షణీయ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు రిసార్టులు నిర్మించాలని సూచించారు. రాష్ర్టం లో 64 లక్షల మంది మహిళలు స్వయం సహాయక బృందాల సభ్యులుగా ఉన్నారని.. వారు తయారుచేసే ఉత్పత్తులకు మార్కెంటింగ్ కల్పించాలని కోరారు. 

ఇక్కడి ఉత్పత్తులకు మార్కెంటింగ్ కల్పించే విషయమై వీ-హబ్ ఒప్పందంపై శ్రీధర్‌బాబు ప్రశంసించారు. మలేషియా తెలంగాణా అసోసియేషన్ (మైటా) ప్రతినిధులు ఎస్ తిరుపతి, సందీప్‌గౌడ్, అమర్నాథ్‌గౌడ్‌లను మంత్రి శ్రీధర్‌బాబు అభినందించారు.

పామాయిల్ విత్తనాలు అందించాలి: మంత్రి తుమ్మల 

మలేషియా నుంచి పామాయిల్ మొలకలు దిగుమతి చేసుకుంటున్నామని, అలా కాకుండా విత్తనాల సరఫరా లేదా ఇక్కడే నర్సరీ ఏర్పాటుకు ముందుకు రావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.

ఎక్కువ ఎత్తు పెరగని, తక్కువ పొడవు ఆకులు ఉండే రకాలను అభివృద్ధి చేయాలని సూచించారు. రాబోయే 4, 5 ఏళ్లలో పది లక్షల ఎకరాలకు పామాయిల్ సాగు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. వ్యాధులను తట్టుకునే రకాలను అభివృద్ధి చేయాలని కోరారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, టీజీఐఐసీ ఎండీ డా.విష్ణువర్ధన్‌రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ డా.మల్సూర్, టీజీఐఐసీ సీఈవో మధుసూదన్ పాల్గొన్నారు.