calender_icon.png 16 January, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.750 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న మలబార్

19-07-2024 01:27:44 AM

  1. స్థానిక స్వర్ణకారులకు కొత్త డిజైన్లపై అవగాహన కల్పించాలి
  2. ఏడాది చివరి నాటికి ఆభరణాల తయారీ

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): ‘మలబార్’ సంస్థ మహేశ్వరంలో ఏర్పాటు చేసిన బంగారం, వజ్రాభరణాల తయారీ యూనిట్ దేశంలోనే అతిపెద్దదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మొదటి దశ నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ కేంద్రంపై ఇప్పటికే మలబార్ రూ.183 కోట్ల పెట్టుబడులు పెట్టిందని, మూడేళ్లలో మొత్తం రూ.750 కోట్లు వెచ్చిస్తుందన్నారు. సచివాలయంలో మలబార్ గ్రూప్ ప్రతినిధులు మంత్రితో భేటీ అయ్యా రు.

ఏడాది చివరి నాటికి 1500 మంది ఉద్యోగులతో అభరణాల తయారీ ప్రారంభమవుతుందని.. పరోక్షంగా మరో 1250 మందికి ఉపాధి దొరుకుతుందని వెల్లడించారు. జ్యూవెలరీ రంగంలో ఎంతో చరిత్ర ఉన్న మలబార్ సంస్థ స్థానిక స్వర్ణకారులకు నూతన డిజైన్లపై అవగాహన కల్పించి ఆదుకోవాలని శ్రీధర్ బాబు సూచించారు. మహేశ్వరం యూనిట్‌లో 120 మంది మహిళలకు అభరణాల తయారీలో శిక్షణ ఇచ్చేందుకు ఎంపిక చేయడంపై మలబార్ చైర్మన్ అహ్మద్‌ను అభినందించారు. మౌలిక సదుపాయాలకు సంబంధించిన అన్ని పనులు నెల రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మలబార్ గ్రూప్ చైైర్మన్‌తో పాటు సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

సోషల్ స్టాక్ ఎక్స్చేంజీ ద్వారా నిధుల సమీకరణ

రాష్ర్ట ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మూలధన సేకరణ కోసం సెబీ రూపొందించిన సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ విధానాన్ని వినియోగించుకోనున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. నిధుల సమీకరణకు సెబీ, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు లోబడి బడా పారిశ్రామిక, వాణిజ్య సంస్థల నుంచి పెట్టుబడులు ఆహ్వానించే ప్రణాళికపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన ఆర్థిక బాధ్యత, నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితులకు లోబడి ఫండ్ సేకరణ జరపడానికి ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ అత్యవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. సామాజిక సంక్షేమ లక్ష్యాలను మార్కెట్ ఆధారిత ఫండ్లతో అనుసంధానించే విస్తృత వ్యూహంలో సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజి ఒక భాగమని అన్నారు. ఎక్విప్ దేశీ అనే పెట్టుబడుల సేకరణ సంస్థ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ ( ఎన్‌ఎస్‌ఈ) ప్రతినిధులు, ప్రభుత్వ కార్యదర్శులు పాల్గొన్నారు.