10-03-2025 12:13:30 AM
మంద కృష్ణ మాదిగ మండిపాటు
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 9 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి మాలల ఒత్తిడికి గురవుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్‌మాదిగ అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ అమలు కాకముందే ఉద్యోగాలను మాలలకు అప్పగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
అందులో భాగంగానే ఈ నెల 10, 11, 14 తేదీల్లో గ్రూప్ పరీక్షల ఫలితాలను విడుదల చేయాలని చూస్తున్నారన్నారు. అదే జరిగితే మాదిగలు, ఎస్సీ వర్గీకరణను కోరుకునే కులాల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. వర్గీకరణ జరిగాకే ఉద్యోగాల భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలన్నారు.
ఏపీలో మాదిగల కంటే మాలల జనాభా ఎక్కువని, అయినప్పటికీ వర్గీకరణ జరిగాకే ఉద్యోగాలు భర్తీ చేయాలని అక్కడి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణలోని జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ మాల, మాదిగ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోలేదని చెప్పారు.
ఇక్కడ మాలల కంటే మాదిగల జనాభా ఎక్కువని అయినప్పటికీ మాలల ఒత్తిడికి తలొగ్గి సీఎం పోస్టులు భర్తీ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పోటీ పరీక్షల ఫలితాల విడుదలను ఆపకపోతే సీఎం రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదంగా మారుతుందని హెచ్చరించారు.