చియాన్ విక్రమ్ కథానాయకుడిగా దర్శకుడు పా రంజిత్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘తంగలాన్’. నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యధార్థ ఘటనల ఆధారంగా రూపొందినీ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమాకు సంగీతం సమకూర్చడం సంతృప్తినిచ్చిందని చెప్పారు.
‘తంగలాన్’తో అనుబంధాన్ని ఆయన ఇలా వివరించారు.. ‘ఈ సినిమా ఆఫర్ నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఆనందంగా, ఉత్సాహంగా అనిపించింది. స్క్రిప్ట్ విన్నప్పుడే ఎలాంటి మ్యూజిక్ చేయాలో అర్థమైంది. స్వాతంత్య్ర పోరాటం సమయంలో గిరిజన నేపథ్యంలో జరిగే కథ కాబట్టి, ట్రైబల్స్ ఎలాంటి మ్యూజిక్ క్రియేట్ చేస్తారనేది ఆలోచించా. ఆస్ట్రేలియన్, ఆఫ్రికన్ ట్రైబ్స్ క్రియేట్ చేసే కొన్ని మ్యూజిక్స్ పరిశీలించా. మోడరన్ మ్యూజిక్ సెట్ కాదని, కథా నేపథ్యానికి తగినట్టుగా మ్యూజిక్ కంపోజ్ చేశాం. ఇందుకోసం నా టీమ్ ఎంతో సపోర్ట్ చేశారు. 50 రోజులు రీ రికార్డింగ్ చేశాం. టైమ్ తక్కువగా ఉండటమనేదొక్కటే నేను ఎదుర్కొన్న సవాలు.
అయినా పర్ఫెక్ట్ ఔట్ పుట్ తీసుకురాగలిగాం. దర్శకుడు తన విజన్‌ను నాకు చెప్పాడు.. అందుకు తగ్గట్టుగా మ్యూజిక్ చేశా. సంగీత దర్శకుడిగా ‘తంగలాన్’కు వర్క్ చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది” అని వివరించారు ప్రకాశ్. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త ప్రపంచాన్ని చూపిస్తుందని, ప్రేక్షకులతో పాటే తానూ ఈ చిత్రాన్ని తెర మీద చూసేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నానని కూడా చెప్పారాయన.