calender_icon.png 23 February, 2025 | 8:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినిమా నిర్మాణం.. వంద పెళ్లిళ్లు చేసినంత కష్టం

23-02-2025 12:17:47 AM

ఇంద్రాని దవులూరి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శక నిర్మాతగా వ్యవహరించిన సినిమా ‘అందెల రవమిది’. ఈ చిత్రానికి వేణు నక్షత్రం కథ అందించగా.. విక్రమ్ కొల్లూరు, తనికెళ్ల భరణి, ఆదిత్య మీనన్, జయలలిత, ఆది లోకేశ్, ఐడీపీఎల్ నిర్మల కీలక పాత్రల్లో నటించారు. శనివారం ఈ మూవీ టీజర్‌ను దర్శకుడు హరీశ్ శంకర్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘హద్దులు దాటుతున్న కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సినిమాలు వస్తున్న ఈ ట్రెండ్‌లో మన సంస్కృతిని తెలియజెప్పాలనే ప్రయత్నంతో ఈ చిత్రాన్ని రూపొందించటం అభినందనీయం’ అన్నారు. ఇంద్రాని మాట్లాడుతూ.. ‘వెస్ట్రన్ డ్యాన్సులు 30 ఏళ్ల తర్వాత చేయలేరు. కానీ భరతనాట్యం చనిపోయేవరకూ చేయొచ్చు.

అలాంటి ప్రత్యేకత మన సంప్రదాయ నృత్య రీతులకు ఉంది’ అని చెప్పారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. ‘సినిమా నిర్మించడం అంటే ఒకటి కాదు వంద పెళ్లిళ్లు చేసినంత కష్టం. చిన్న సినిమాకు ఉండే అలాంటి కష్టాలన్నీ పడి ఇంద్రాని ఈ సినిమా పూర్తి చేసింది’ అన్నారు.

దర్శకుడు కృష్ణచైతన్య మాట్లాడుతూ.. ‘మన కళల్ని బతికించేందుకు ఇంద్రాని చేస్తున్న ప్రయత్నం అభినందనీయం’ అన్నారు. నటుడు ఆదిత్య మీనన్, సహాయ దర్శకుడు సాయి పల్లె, చిత్రబృందం పాల్గొన్నారు.