calender_icon.png 23 December, 2024 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయ బాట వేసుకొవాలి

02-11-2024 11:55:09 PM

ఏ రంగంలో అయినా విజయానికి దారి ఎవరికి వారు వేసుకోవాలి. దాన్నే విజయ బాట అంటారు. మొదట ఈ బాట వేసుకుని పయనం మొదలుపెట్టాలి. సరే బాట వేసుకున్నాం. మరి మార్గం ఎలా? మొదలంటూ పెట్టగానే మీకు ఎన్నో అవాంతరాలు అడ్డంకులు ఎదురవుతాయి. అది సహజం. ఏ రంగంలో విజేతగా నిలిచిన వారికయినా ఈ అడ్డంకులు ఎదురవుతాయి. తప్పదు. కాకపోతే వారు వాటిని తెలివితో, సహనంతో ఎదిరించారు, గెలిచారు. అలాగే కొత్తగా ఏ రంగంలో అయినా ప్రవేశించే వారికి కూడా ఎన్నో అవాంతరాలు వస్తాయి. మీ పట్టుదలను, సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాయి. వాటికి భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. ఆత్మ విశ్వాసంతో పోరాట పటిమతో లక్ష్యాన్ని చేరాలి.

నిరంతరం కృషి చేస్తూ ఉంటే మన లక్ష్యానికి మార్గం సులువు అవుతుంది. మన బాటలో ముళ్ళు ఎదురైనా, సవాళ్ళు ఎదురుపడినా భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. ఆగితే సాగదు అని అంటారు పెద్దలు. నేడు యువత ఎక్కువగా తక్కువ సమయంలో అతి త్వరగా అన్ని రంగాలలో విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ఒక వేళ ఓటమి ఎదురైతే వెంటనే నిరాశకు గురి అవుతారు. లేదా చేసే పనిలో ఉత్సాహాన్ని వదిలి నిరుత్సాహానికి గురవుతారు. అంతేతప్ప లోపం ఎక్కడ ఉంది, ఎందులో ఉంది, దాన్ని ఎలా తొలగించాలి అని ఆలోచించరు.  తమ లక్ష్యాలను గాలికి వదిలి వేస్తారు. ఇలాంటి వారు తమని తాము స్వయంగా మోటివేట్ చేసుకోవాలి.

లేదా ఇతరుల సహాయంతో, ప్రోత్సాహంతో తమలో పోయిన పట్టుదలను, ఉత్సాహాన్ని తిరిగి తెచ్చుకోవాలి. విద్యార్థులకు చదువు, ఉద్యోగం లక్ష్యం. దాని మీద బాగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. వ్యాపారుల లక్ష్యం స్థిరత్వం. ముందు చూపుతో నీతి, నిజాయితీగా నాణ్యత కలిగిన సరుకు రవాణా చేస్తే మీ వ్యాపార రంగంలో విజేతగా మారుతారు.

ఏ రంగంలో గెలవాలన్నా అప్పటికప్పుడు సాధించలేరు. అహర్నిశలు శ్రమించి చెమటోడ్చి పండించిన రైతు తన పంట కోసినప్పుడు, దాన్ని మంచి ధరకు అమ్మినప్పుడు అతని కంట్లో చూడాలి విజయానందం. కష్టపడి ఎంతో పెట్టుబడితో సినిమా తీసిన ఒక ప్రొడ్యూసర్ దాన్ని ప్రేక్షకులముందుకు తీసుకెళ్లడం ఒక ఎత్తు.  ప్రేక్షకులు ఆదరించి విజయాన్ని అందివ్వడం మరో ఎత్తు. ఒక నాయకుడు ఎన్నికల్లో నిలవడం ఒక ఎత్తు. ఆపై గెలవడం మరో ఎత్తు.

ఇలా ప్రతీ రంగంలో  ఎంతో పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. కానీ చూసే వారికి వాళ్ళు సునాయాసంగా గెలిచారనిపిస్తుంది. అది ఏ మాత్రం నిజం కాదు. కష్ట పడనిదే  ఎవరికీ ఏదీ రాదు. అది డబ్బు అయినా పదవి అయినా సరే. ఇటీవల కన్నుమూసినదిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌టాటా లాంటి వ్యక్తులే ఇందుకు నిదర్శనం. కావున ఏ రంగంలో విజయాన్ని సాధించాలన్నా కచ్చితంగా స్వయంకృషితో అడుగేయాలి. మీ గమ్యానికి మీరే విజయబాటను వేసుకోవాలి.

 శ్రిష్టి శేషగిరి