30-04-2025 12:29:08 AM
అఖిల పక్ష కార్మిక సంఘాల సంయుక్త సమావేశం పిలుపు
ఖమ్మం, ఏప్రిల్ 29 ( విజయక్రాంతి ):- దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని, ఈ చర్యను నిరసిస్తూ మే 20న జరిగే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ప్రజలకు అఖిల పక్ష కార్మిక సంఘాల సంయుక్త సమావేశం పిలుపునిచ్చింది. మంచికంటి భవన్లో అఖిలపక్ష కార్మిక సంఘాల జిల్లా స్థాయి సంయుక్త సమావేశం మంగళవారం జరిగింది.
సమావేశానికి ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి శింగు నర్సింహారావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జే. వెంకటేష్, టియుసిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సూర్యం, ఐఎన్టియుసి రాష్ట్ర నాయకులు -పాల్వంచ కృష్ణ, ఐఎన్టియు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కె. రాంసింగ్లు హాజరయ్యారు.
ఈ సమావేశంలో కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ కార్మికులకు సంబంధించి ఏ చట్టాన్ని కార్మికుల పట్ల అభిమానంతోనో, వారి బాధలు గమనించో ఏ ప్రభుత్వం చేయలేదని భారతదేశ కార్మిక వర్గం -అనుభవిస్తున్న ప్రతి హక్కు వెనక దశాబ్దాల పోరాటం దాగి ఉందన్నారు.
అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాసేందుకు సిద్ధమైందన్నారు.ప్రభుత్వ వైఖరికి నిరసనగా జరిగే ఈ సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు మద్దతునివ్వాలని సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.