- ఎన్యూమరేటర్లకు సహకరించండి
- పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్
- కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు లేఖ
హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుల గణన సర్వేను పార్టీ కార్యకర్తలు, నాయకులు విజయవంతం చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సూచించారు. సోమవారం ఆయన పార్టీ శ్రేణులనుద్ధేశించి ఓ లేఖను విడుదల చేశారు.
కుల గణన అనేది బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమని, ఈ సర్వేలో ఆయా గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు పాల్గొని అధికారులకు సహకరించాలని కోరారు. కుల గణనలో తేలిన ఆయా కులాల జనాభా ఆధారంగా సామాజిక న్యాయాన్ని సంపూర్ణంగా అమలు చేస్తామని తెలిపారు.
తెలంగాణ కుల గణన దేశానికి ఆదర్శంగా, రోల్ మాడల్‌గా ఉండాలని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల బాగు కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని.. వారి కుట్రలను తిప్పికొట్టాలని శ్రేణుల కు పిలుపునిచ్చారు.
ప్రజలకు ఏమైనా సందేహాలు, సమస్యలుంటే వాటిని నివృత్తి చేసి పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని విజ్ఙప్తి చేశారు. గాంధీభవన్‌లోని కనెక్ట్ సెంటర్ నుంచి రోజువారిగా ఫోన్ చేస్తారని, ఏదైనా డౌట్స్ ఉంటే అడిగి తెలుసుకోవాలని సూచించారు.