calender_icon.png 15 January, 2025 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను విజయవంతం చేయండి

15-01-2025 07:13:32 PM

జనవరి 26న అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను విజయవంతం చేయండి.. 

కలెక్టర్ జితేష్ వి పాటిల్... 

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుంచి చేపట్టిన నాలుగు సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక వేగవంతం చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్(Collector Jitesh V Patil) ఆదర్శించారు. బుధవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ... లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియని, మొదటి విడతలో నిరుపేదలకు ప్రాధాన్యం కల్పించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు అధికారులందరూ అంకితభావంతో పనిచేయాలన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. లబ్ధిదారు ఎంపికలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా లబ్ధిదారుల ఎంపికను పూర్తిచేయాలాన్నారు. నాలుగు సంక్షేమ పథకాల (రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు (రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఇళ్లు) విధివిధానాలపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాల అమలును జనవరి 26న ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా, మండల స్థాయి అధికారులందరూ నిబద్ధతతో పనిచేయాలని పేర్కొన్నారు.

గ్రామ సభలను పక్కాగా నిర్వహించాలని, ఈ నెల 16(రేపటి) నుంచి 20 వరకు చేపట్టే క్షేత్రస్థాయి సర్వేలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియను సజావుగా పూర్తిచేయాలని, అలాగే 16 నుంచి 20 వరకు లబ్ధిదారుల ముసాయిదా జాబితా తయారీలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని, 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామ సభలు పక్కాగా జరిగే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని, 21 నుంచి 25 వరకు డేటా ఎంట్రీ లో తప్పులు దొర్లకుండా చూడాలని, ఫ్లెక్సీ లు, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని, అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డులో ప్రచురించాలని, గ్రామ సభల్లో వచ్చే ఫిర్యాదులపై రిజిస్టర్ లను, కంట్రోల్ రూం లను ఏర్పాటు చేసి, అర్జీలను స్వీకరించాలని, ఈ సర్వే, గ్రామ సభల పట్ల ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని, విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

రైతు భరోసా పథకం

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు గాను వ్యవసాయ యోగ్యమైన భూములకు పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ. 6000 చొప్పున రెండు విడతలుగా రూ. 12,000 భూ భారతి (ధరణి) పోర్టల్ లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమికి మాత్రమే రైతు భరోసా చెల్లిస్తుందని, అలాగే ఇళ్లు (లేదా) కాలనీలుగా మారిన అన్ని రకాల భూములు, రియల్ ఎస్టేట్ భూములు, లేఅవుట్ చేసిన భూములు, నాలా కన్వర్షన్ చేసిన భూములు, మైనింగ్ చేస్తున్న భూములు, గోదాములు నిర్మించిన భూములు, వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములు, రాళ్ళు, రప్పలు, గుట్టలతో నిండి, సాగుకు అనువుగా లేని భూములను గుర్తించి, తొలగించాలని సూచించారు.

ఈ నెల 16వ తేదీ నుంచి ప్రతి రెవెన్యూ గ్రామాల వారీగా ఏఈఓ, ఆర్ఐ, సర్వేయర్ లు ఒక బృందంగా ఏర్పడి, కలిసికట్టుగా పనిచేయాలని, ఇందుకోసం ఆయా మండలాల తహసీల్దార్, మండల వ్యవసాయాధికారి బాధ్యులుగా ఉంటారని, వారు సంయుక్తంగా జాబితాలోని అన్ని సర్వే నంబర్ లను క్షేత్రస్థాయిలో సందర్శించి, వ్యవసాయానికి యోగ్యం కానీ భూములను ధృవీకరించుకోవాలని ఆదేశించారు. 3 లేదా 4 గ్రామాలకు కలిపి ఒక మండల స్థాయి క్లస్టర్ నోడల్ అధికారిని నియమించాలని, అలాగే ఈ ప్రక్రియ మొత్తాన్ని మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులన్నీ క్రోడీకరించుకోవడంతో పాటు గ్రామాల మ్యాపులను పరిశీలించాలన్నారు. ఈ యోగ్యం కాని భూముల జాబితాను ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత జాగ్రత్తగా రూపొందించాలని, ఈ జాబితాను గ్రామ సభల్లో ప్రదర్శించాలని, చదివి వినిపించాలని, చర్చించిన తర్వాతనే వెల్లడించాలని తెలిపారు.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబానికి రూ. 6000 చొప్పున రెండు విడతలుగా రూ. 12,000 నగదు సాయం అందించనున్న నేపథ్యంలో 2023-24 సంవత్సరానికి గాను కనీసం 20 రోజులు ఉపాధి హామీ పని దినాలు పూర్తిచేసుకున్న భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. ఇందుకోసం రాష్ట్రస్థాయి నుంచి జిల్లాల వారీగా వచ్చిన ముసాయిదా అర్హుల జాబితాలో లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియలో భాగంగా ఉపాధి హామీ కూలీ గుర్తింపు కార్డును, ఆధార్ కార్డుతో లింక్ చేయాలని, లేని వాటిని నవీకరించాలని, ఈ ప్రక్రియకు బాధ్యులుగా ఎంపిడిఓ ఉంటారని, ఎంపిడిఓలు, ఎంపిఓలు సమన్వయంతో పనిచేయాలని, అలాగే ప్రతి గ్రామ సభల్లో ఈ జాబితాను ప్రచురించాలని, చదివి వినిపించాలని, ఎలాంటి అపోహలు తలెత్తకుండా గ్రామ సభల్లో చర్చించి, ఆమోదించడం జరుగుతుందని సూచించారు. ఒకవేళ ఏమైనా అభ్యంతరాలు గ్రామ సభల్లో వస్తే, వాటిని స్వీకరించి, పరిశీలించి, పది రోజుల్లోగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కొత్త రేషన్ కార్డులు

కొత్త ఆహార భద్రత కార్డులు (రేషన్ కార్డులు) పథకంలో భాగంగా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. రాష్ట్ర స్థాయి నుంచి అన్ని జిల్లాల వారీగా కుల గణన సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డులు లేని పేద కుటుంబాల జాబితా ప్రకారం పరిశీలించాలని, ఇందుకోసం జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), డీసీఎస్ఓ పర్యవేక్షకులుగా వ్యవహరించాలని, మండల స్థాయిలో ఎంపిడిఓ, మున్సిపాలిటీలో మునిసిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులుగా ఉంటారని, అలాగే  భూములు, ఆదాయం తదితర అంశాలను రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు గుర్తించాలని, పంచాయతీ కార్యదర్శులు కుటుంబాల వివరాలను సేకరించాలని సూచించారు. అందుకు సంబంధించిన ఫీల్డ్ వెరిఫికేషన్ ఫార్మ్ లో కుటుంబాల సమగ్ర వివరాలను తప్పులు లేకుండా నమోదు చేసి, ఈ ముసాయిదా జాబితాను గ్రామ, వార్డు సభల్లో ప్రదర్శించాలని, చదివి వినిపించాలని, చర్చించిన తర్వాతే అమోదించడం జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే ఒక రేషన్ కార్డు ఒక వ్యక్తికి ఒకే చోట ఉండాలన్నారు. 

ఇందిరమ్మ ఇళ్ల పథకం

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జీఓ నంబర్ 7 ప్రకారం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న గృహాలు, ఇళ్లు లేనివారు, పూరిగుడిసెలు ఉన్నవారు, అద్దె ఇళ్లలో నివాసం ఉన్నవారు, నిర్మాణానికి స్థలం ఉన్నవారు అర్హులను తెలిపారు. ఇందులో భాగంగా మట్టి గోడలు, పైకప్పు లేని గృహాలు, వితంతువులకు, భూమిలేని వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇందుకోసం ఈ నెల 18 లోగా ఎంపిడిఓలు, మునిసిపల్ కమిషనర్ లాగిన్ లలో ఎటువంటి లోపాలు దొర్లకుండా సూపర్ చెక్ ను పూర్తిచేయాలని ఆదేశించారు. ఒక కుటుంబానికి ఒకటే ఇల్లు కేటాయించేందుకు గాను ఏఐ, జియో ట్యాగింగ్ ద్వారా డీడూప్లికేషన్ చేయాలని సూచించారు. అలాగే ఏమైనా  పొరపాట్లు ఉంటే పీడీ హౌసింగ్ కు పంపించాలని, వివరాలను సరిదిద్దేందుకు ఎడిట్ ఆప్షన్ కల్పించినట్లు వివరించారు. 

అదే విధంగా గ్రామ సభల నిర్వహణకు యాక్షన్ ప్లాన్ ను తయారు చేయాలని, గ్రామ సభలకు ఆర్ఐ, ఏఈఓ, పంచాయతీ కార్యదర్శి బృందంగా ఏర్పడాలని, వార్డు సభలకు వార్డు అధికారి, డిప్యూటీ తహసీల్దార్, ఏఈ బృందంగా ఉండాలని, 4 (లేదా) 5 గ్రామాలకు కలిపి క్లస్టర్ వారీగా ఎంపిడిఓ, తహసీల్దార్, సూపరింటెండెంట్ సమన్వయ బృందంగా నియమించాలని సూచించారు. ఈ మొత్తం సంక్షేమ పథకాల ప్రక్రియలు మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. 

ఈ ప్రక్రియకు సరిపడా కంప్యూటర్ లను ఏర్పాటు చేయాలని, డేటా ఎంట్రీ ఆపరేటర్ లను అందుబాటులోకి తీసుకోవాలని, ప్రతి క్లస్టర్ వారీగా ఒక సిస్టమ్ ఉండాలన్నారు. అలాగే ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రతులను, గ్రామ సభల తీర్మాన ప్రతులను సురక్షితంగా, ఎంతో జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు. మీ సమావేశంలో అదనపు కలెక్టర్లు డి వేణుగోపాల్, విద్యా చందన, కొత్తగూడెం భద్రాచలం ఆర్డీవోలు, తాసిల్దార్, ఎంపీడీవోలు ఎంపివో లు పాల్గొన్నారు.