27-03-2025 12:40:29 AM
కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ మార్చి 26 (విజయ క్రాంతి) : పది పరీక్షలను సవ్యంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం మిడ్జిల్ మండల కేంద్రంలోని చైతన్య భారతి హై స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తనిఖీ చేశారు.
ఈ కేంద్రాలలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలు అన్నింటిని చీఫ్ సూపరింటిండెంట్ ల ద్వారా అడిగి తెలుసుకున్నారు.పరీక్ష కేంద్రాల వద్ద భద్రతను పకడ్బందీగా నిర్వహించాలని, ఎట్టి పరిస్థితులలో ఇతరులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించవద్దని, పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్లు అనుమతి లేదని చెప్పారు.
పరీక్ష కేంద్రాల పరిధిలో జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని,పోలీస్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పరీక్షలు సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.వేసవి దృష్ట్యా వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రాథమిక చికిత్స మందుల తో పాటు ఓ అర్.ఎస్.పాకెట్ లు సిద్ధంగా ఉంచుకోవాలని, ఆదేశించారు. జిల్లా పరిషత్. ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం సిద్ధం చేస్తున్న నిర్వాహకులతో కలెక్టర్ మాట్లాడారు.విద్యార్థులకు నాణ్యమైన ఆకు కూరలు, కూరగాయలు,గుడ్లు మెనూ ప్రకారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమితి అధికారులు ఉన్నారు.