calender_icon.png 24 October, 2024 | 11:57 PM

నూతన రెవెన్యూ చట్టం ముసాయిదాపై సలహాలు, సూచనలు చేయండి

09-08-2024 02:08:52 AM

అఖిల పక్ష సమావేశంలో కోదండరెడ్డి 

హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 8 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం త్వరలో అమల్లోకి తెస్తున్న నూతన రెవెన్యూ చట్టం  2024 ముసాయిదాపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతోపాటు ప్రజలు కూడా సలహాలు, సూచనలు ఇవ్వాలని ధరణి కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి కోరారు. గురువారం ఫతేమైదాన్ క్లబ్‌లో కోదండరెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి రద్దుతోపాటు నూతన రెవెన్యూ చట్టం విషయంలో ప్రభుత్వం అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

ధరణి కారణంగా రాష్ట్రంలో రైతులు అవస్థ పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం రెండు లక్షల పైచిలుకు దరఖాస్తులు కలెక్టర్ల వద్ద పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించారు. నూతన రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందని స్పష్టంచేశారు. ఇందులో భాగంగానే అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి, ప్రజల అభిప్రాయం తీసుకొని ప్రజల నుంచే నూతన రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు సామ రామ్మోహన్‌రెడ్డి, సీపీఎం నేత సారంపల్లి మల్లారెడ్డి, సీపీఐ నుంచి పశ్యపద్మ, పర్యావరణ వేత్త దొంతి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.