calender_icon.png 1 March, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవికాలంలో నగర ప్రజలకు త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు వేయండి

01-03-2025 05:30:32 PM

ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టి సమయం ప్రకారం త్రాగు నీరు సరఫరా చేయాలి. 

రిజర్వాయ్ వారిగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి త్రాగు నీటి సరఫరా లో ప్రత్యేక పర్యవేక్షణ చేయాలి. 

విలీన గ్రామాల నీటి సరఫరా పై ప్రత్యేక దృష్టి సారించి... మిషన్ భగీరథ నీరు రాకుంటే నగరపాలక సంస్థ ద్వారా నీటి సరఫరా చేయాలి. 

నల్లాలకు ఆన్ ఆఫ్ లేకుండా నీటిని వృధా చేస్తున్నట్లు దృష్టికి వస్తే 500 రూపాయల జరిమానా వేయండి.  

మోటార్లు బిగించి నీటి చౌర్యానికి పాల్పడిన వారిపై నగరపాలక సంస్థ చట్టం ప్రకారం చర్యలు తప్పవు. 

వేసవి కాలంలో నీటిని వృధా చేయకుండా... పొదుపు చేసి వాడుకోవాలి. 

నగరపాలక సంస్థ సమావేశం మందిరంలో నీటి సరఫరా విభాగం అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం. 

వేసవికాలం సమ్మర్ ఆక్షన్ ప్లాన్ పై అధికారులకు సలహాలు సూచనలు. 

నీటి సరఫరా లో తీస్కునే జాగ్రత్త చర్యల పై ఆదేశాలు జారీ. 

కరీంనగర్ (విజయక్రాంతి): త్రాగు నీటి సరఫరా సమయంలో నల్లాలకు మోటార్లు బిగించి... నీటి చౌర్యంకు పాల్పడితే నగరపాలక సంస్థ చట్టం ప్రకారం చర్యలు తీస్కోవాలని కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశై మందిరంలో శనివారం రోజు నీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం జరిగింది. వేసవికాలంలో త్రాగు నీటి సరఫరా ప్రణాళిక అమలు చేయడం, నీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవడం, రిజర్వాయర్ల వారిగా త్రాగు నీటి సమస్యలు పరిష్కరించడం, ప్రజలకు సమయం ప్రకారం నీటి సరఫరా చేయడం, నల్లా పన్నులు వసూళ్లు చేయడం, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ద్వారా త్రాగు నీటి సరఫరా పర్యవేక్షణ చేయడం, రికేజీలను అరికట్టి... ప్రజలకు ప్రతి రోజు నీరు సరఫరా చేయడం లాంటి తదతర అంశాలపై అధికార సిబ్బందితో సుదీర్ఘంగా చర్చించారు. వేసవి కాలంతో ప్రజలకు త్రాగు నీటి సమస్యల రాకుండా ఆక్షన్ ప్లాన్ అమలు, చేపట్టాల్సిన  జాగ్రత్త చర్యలపై పలు సలహాలు సూచనలు చేసి ఆదేశాలు జారీ చేశారు. ఈ

సంధర్బంగా కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ.... వేసవికాలంలో నగర ప్రజలకు త్రాగు నీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా... సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. నీటి సరఫరా పర్యవేక్షణ కోసం  రిజర్వాయర్ల వారిగా ఏఈ, డీఈ, సిబ్బందితో కలిపి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలన్నారు. టాస్క్ ఫోర్స్ ద్వారా ప్రతి రోజు ఒక ఏరియాలో నీటి సరఫరా పై పర్యవేక్షణ చేస్తూ... ఎక్కడెక్క ఎలాంటి సమస్యలు ఉన్నాయో గుర్తించాలన్నారు. వాటికి ప్రణాళికలు సిద్దం చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. నీటి సరఫరా లో రిజర్వాయర్ల వారిగా లీకేజీలను గుర్తించి... అరికట్టడంతో పాటు వాల్స్ రిపేర్ చేసి... పూర్తిగా చెడిపోయి ఉంటే మార్చాలని అన్నారు. నీటి సరఫరా సమయంలో నివాస గృహాలలో నీరు వృధా చేయకుండ చర్యలు తీస్కోని నల్లాలకు ఆన్ ఆఫ్ లేకుంటే బిగించేలా చర్యలు తీస్కోవాలన్నారు. సరఫరా అవుతున్న త్రాగు నీరు సురక్షితంగా ఉందా... లేదా అని తనిఖీ చేయాలని... నీరు కలుషితం అయితే వెంటనే తగిన జాగ్రత్తలు తీస్కోవాలన్నారు.

నల్లా కనెక్షన్లు లేనివారికి నల్లా కలెక్షన్లు ఇప్పించడంతో పాటు నల్లా పన్నులను వసూలు చేయాలని ఆదేశించారు. ఆన్ లైన్ లేని నల్లాల కనెక్షన్లను ఆన్ లైన్ చేసే చర్యలు కూడ చేపట్టాలన్నారు. నివాస గృహాలలో ఆన్ ఆఫ్ బటన్ లేకుండా నీటిని వృధాగా వదిలేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టి... అలాంటి చర్యలకు పాల్పడిన వారికి పలుమార్లు విన్నవించాలన్నారు. అయినా తీరు మారకుంటే 500 రూపాయి జరిమాన విధించాలన్నారు. నగరంలో నల్లాలకు మోటార్లు బిగించి నీటి చౌర్యానికి పాల్పడితే అలాంటి వారిని గుర్తించి నగరపాలక సంస్థ చట్టం ప్రకారం చర్యలు తీస్కోవాలని ఆదేశించారు. వేసవి కాలంలో ఎక్కడ నీటి సరఫరా లో అంతరాయం కలిగిన వెంటనే స్పందించి... సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. రిజర్వాయర్ల లో స్టాండ్ బై మోటార్లు ఏర్పాటు చేస్కోవాలన్నారు. ప్రణాళికల ప్రకారం కావల్సిన సమాగ్రిని అందుబాటులో ఉంచుకొవాలన్నారు. లీకేజీల లేబర్ల హాజరు శాతం ఏఈ డీఈలు పర్యవేక్షణ చేసి... లేబర్లతో లీకేజీలు అరికట్టేలా చర్యలు తీస్కోవాలన్నారు. విలీన గ్రామాలతో సహా నగర వ్యాప్తంగా ఎక్కడ త్రాగు నీటి లో ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు.

విలీన గ్రామాల ప్రజలకు మిషన్ భగీరథ నీరు సరఫరా కాకుంటే నగరపాలక సంస్థ ద్వారా నీరు అందించాలన్నారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని అందించి ప్రజల దాహాం తీర్చాలని అధికారులను ఆదేశించారు. భగీరథ నీరు తగ్గిపోతే ఏఈ డీఈలు సిబ్బందితో కలిసి ప్రత్యేక తనిఖీ పర్యవేక్షణ చేపట్టి పూర్తి స్థాయి స్టడి చేసి రిపోర్టు అందించాలని అన్నారు. ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం త్రాగు నీటి సరఫరా కు తగిన చర్యలు తీస్కోవాలన్నారు. నగర ప్రజలు వేసవికాలం దృష్ట్యా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.  త్రాగు నీటిని వృధా చేయకుండ అవసరం మేరకే వినియోగించుకొని నీరు వృధాగా పోకుండా మీ నల్లాలకు ఆన్ ఆఫ్ బిగించుకొవాలన్నారు. నల్లా పన్నులను చెల్లించి నగరపాలక సంస్థ కు సహాకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఈఈ యాదగిరి, డీఈలు లచ్చిరెడ్డి, వెంకటేశ్వర్లు, అయూభ్ ఖాన్, ఏఈలు, పిట్టర్లు, లైన్ మెన్ లు తదితరులు పాల్గొన్నారు.