19-03-2025 12:00:00 AM
‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. అలాగే ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి విడుదలైన ‘లడ్డు గాని పెళ్లి’, ‘స్వాతిరెడ్డి’ పాటలు కూడా మారుమోగిపోతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మూడో గీతం ‘వచ్చార్రోయ్’ విడుదలైంది.
మ్యాడ్ గ్యాంగ్‌కి తిరిగి స్వాగతం పలకడానికి సరైన గీతం అన్నట్టుగా ‘వచ్చార్రోయ్’ ఉంది. భీమ్స్ సిసిరోలియో స్వరపరచి, ఈ పాటను స్వయంగా ఆలపించగా.. దర్శకుడు కేవీ అనుదీప్ సాహిత్యం అందించారు. “ఏసుకోండ్రా మీమ్స్, చేసు కోండ్రా రీల్స్, రాసుకోండ్రా హెడ్ లైన్స్.. ఇది మ్యాడ్ కాదు మ్యాడ్ మ్యాక్స్” వంటి పంక్తులతో అందరూ పాడుకునేలా గీతాన్ని రాశారు.
మొదటి భాగంలో తమ అల్లరితో నవ్వులు పూయించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ త్రయం.. ‘మ్యాడ్ స్క్వేర్’లో అంతకుమించిన అల్లరి చేయబోతున్నారు. శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. భారీ అంచనాల నడుమ 2025, మార్చి 28న ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం విడుదల కానుంది.