calender_icon.png 20 April, 2025 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న జాతరకు ఏర్పాట్లు చేయండి

13-12-2024 12:38:24 AM

  1. జనవరి 19 నుంచి మార్చి 24 వరకు ఉత్సవాలు
  2. భక్తులకు సమస్యలు తలెత్తకుండా చర్యలు
  3. ప్రసాదం తయారీలో నాణ్యత పాటించాలి
  4. అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా చేర్యాలలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణం, జాతరను వైభవోపేతంగా నిర్వహించాలని అధికారులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. జాతరకు వచ్చే వేలాది భక్తులను దృష్టిలో పెట్టుకుని పొరపాట్లు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు.

సచివాలయం నుంచి సిద్దిపేట జిల్లా అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సం దర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. జనవరి 19 నుంచి మార్చి 24 వరకు కొమురవెల్లి మల్లన్న జాతర నిర్వహించేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కల్యాణ వేదికను విశాలంగా ఏర్పాటు చేయాలని ఈవోకు సూచించారు.

కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమ్మవార్లు బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలకు కిరీటాల తయారీపై మంత్రి సురేఖ ఆరా తీశారు. రూ.9.776 కోట్లు ఎస్డీఎఫ్ నిధులు, రూ.36.18 కోట్ల దేవాదాయ శాఖ నిధులతో చేపడుతున్న కార్యక్రమాలను ఈవో వివరించారు. ఎల్లమ్మ ఆలయంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు.

ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చే భక్తుల కోసం క్యూలైన్లు, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా, వీవీఐపీలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు, భక్తులకు దారులను తెలిపేలా సైన్ బోర్డులు, తాగునీటి సదుపాయం, మెడికల్ క్యాంపు, లాక్టేషన్ గదులు తదితర ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

జాతర సమయంలో వేసవి ప్రారంభమవుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, నడిచే మార్గాల్లో మ్యాట్లు, వృద్ధులు, వికలాంగులు, గర్భిణులకు బ్యాటరీ వాహనాలు తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను సంపూర్ణంగా నిషేధించాలని ఆదేశించారు. ప్రసాదం తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.

మల్లికార్జున స్వామి కల్యాణోత వాని కి రావాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డిని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆహ్వానించనున్నట్టు మంత్రి సురేఖ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, సిద్దిపేట కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) అబ్దుల్ హమీద్, ఆర్డీవో, కొమురవెల్లి ఆలయ ఏఈవో శ్రీనివాస్ తదితర శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.