calender_icon.png 10 October, 2024 | 11:56 AM

రూ.5 లక్షల వార్షికాదాయం దాటిన మెజారిటీ కుటుంబాలు

28-08-2024 12:30:00 AM

దేశంలో 150 జిల్లాల్లోనే నివాసం

న్యూఢిల్లీ, ఆగస్టు 27: రూ.5 లక్షల వార్షిక ఆదాయంపైబడిన మెజారిటీ కుటుంబాలు దేశంలోని 150 జిల్లాల్లోనే ఉన్నాయని మ్యాప్‌మైఇండియా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రూ.5 లక్షల ఆదాయాన్ని మించిన 60 శాతం కుటుంబాలు కేవలం 20 శాతం జిల్లాల్లోనే కేంద్రీకృతమయ్యాయంటూ ఆ గణాంకాల ఆధారంగా అనలిటిక్స్ సంస్థ క్లారిటీ ఎక్స్ మంగళవారం ఒక నివేదిక విడుదల చేసింది. ఈ జిల్లాల్లో అత్యధికంగా దేశంలోని పశ్చిమ ప్రాంతంలోనివేనని తెలిపింది. ఆదాయ పంపిణీ, తలసరి విద్య, వైద్య సదుపాయాలు, మౌలిక వసతుల లభ్యత, బ్యాంకింగ్ కవరేజ్ తదితర సమాజిక ఆర్థిక సూచికలతో కూడిన డిస్ట్రిక్ట్ పొటెన్షియల్ ఇండెక్స్ (డీపీఐ) ఆధారంగా జిల్లాల అభివృద్ధిని కొలిచినట్టు నివేదిక తెలిపింది.

2019 డీపీఐ స్కోర్‌తో 2023 స్కోర్‌ను పోలిస్తే 2023లో నమోదైన స్కోరు ఆధారంగా వృద్ధిని లెక్కించినట్టు వివరించింది. దేశంలోని 36 రాష్ట్రాల్లో 788 జిల్లాల్లోకెల్లా అత్యధిక స్కోరు సాధించినవాటిలో  బెంగళూరు ఆర్బన్, హైదరాబాద్ జిల్లాలు ప్రధమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయన్నది. ఉత్తర పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ల్లో వేగంగా వృద్ధిచెందుతున్న కొన్ని జిల్లాలు ఉన్నాయని, జార్ఖండ్ మధ్య, తూర్పు ప్రాంతాలు, త్రిపురల్లో జిల్లాలు అధికంగా వృద్ధి సాధిస్తున్నాయన్నది.