- ఎస్‌ఎస్‌బీ ప్లాస్టిక్ పరిశ్రమలో చేలరేగిన మంటలు
- 100 కోట్లకు పైగా ఆస్తి నష్టం, తప్పిన ప్రాణపాయం
- మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోన్న అగ్నిమాపక సిబ్బంది
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (విజయక్రాంతి): జీడిమెట్ల పారిశ్రామికవాడలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్‌ఎస్‌బీ ప్లాస్టిక్ బ్యాగుల తయారీ పరిశ్రమలో పెద్దఎత్తున మంటలు చేలరేగాయి. పరిశ్రమలోని మూడో అంతస్తులో చేలరేగిన మంటలు క్రమంగా గ్రౌండ్ ఫ్లోర్ వరకు వ్యాపించాయి.
దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్‌లు, వాటర్ ట్యాంకర్‌ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనా స్థలంలో పరిస్థితిని జీడిమెట్ల సీఐ, బాలనగర్ ఏసీపీ పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.
పరిశ్రమలోని మొదటి అంతస్తులో అధిక మొత్తంలో పాలిథిన్ సంచుల తయారీకి వినియోగించే ముడి సరుకు(కెమికల్ డ్రమ్ములు) ఉండటంతో మంటలు అదుపు చేయడం కష్టంగా మారింది. కెమికల్ డ్రమ్ములు ఒక్కొక్కటిగా పేలుతుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సమారు రూ.100 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని సమాచారం.
అర్థరాత్రి వరకు మంటలను కొనసాగుతుండగా అగ్నిమాపక సిబ్బంది, డీఆర్‌ఎఫ్, జీహెచ్‌ఎంసీ, నాలుగు పోలీసు స్టేషన్లకు చెందిన సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్ని ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పరిశ్రమ భవనం కూలడం ప్రారంభం అయ్యింది.