calender_icon.png 30 April, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు

29-04-2025 11:42:51 PM

ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలు ముగ్గురు పరిస్థితి విషమం హైదరాబాద్కు తరలింపు..

పేలుడు శబ్దానికి కుప్పకూలిన భవనం. పరుగులు తీసిన కార్మికులు..

యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా మోట కొండూరు మండలం కాటేపల్లి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో మంగళవారం నాడు భారీ పేలుడు సంభవించి ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. భారీ పేలుడుకు కంపెనీ భవనం నేలమట్టమైంది. పనిచేస్తున్న కార్మికులు ప్రాణాలను వారి చేతుల్లో పెట్టుకొని పరుగులు తీశారు. కంపెనీలోని 18వ ఈ బ్లాక్ రియాక్టర్ లో రసాయనాలు కలుపుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిసింది. బ్లాక్ లో మొత్తం ఆరుగురు కార్మికులు పనిచేస్తుండగా ఐదుగురు ప్రమాదానికి గురయ్యారు.

పులిగిల్ల గ్రామానికి చెందిన లింగస్వామి, చాడ గ్రామానికి చెందిన శ్రీకాంత్, ఆలేరు పట్టణానికి చెందిన శ్రీకాంత్, మహేష్ లు తీవ్రగాయాల పాలయ్యారు. భారీ పేలుడు శబ్దంతో కంపెనీ పరిసర ప్రాంతాలలో భయానక వాతావరణ ఏర్పడింది. భవనం కుప్పకూలిపోగా రేకుల షెడ్లు, ఇతర సామాన్లు చెల్లా చెదిరి ఆకాశమంత ఎత్తేగిరి పరిసర గ్రామ ఇళ్లమీద పడ్డాయి. ఈ నేపథ్యంలో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంపం వచ్చిందా అనే భయంతో ఒక్కసారిగా ప్రజలంతా ఇళ్ల నుండి బయటకు వచ్చారు. ఎక్స్ప్లోజివ్ కంపెనీ లో భారీ పేలుడు సంభవించి మంటలు ఎగిసిపడుతున్న దృశ్యం చూసి గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కంపెనీ యాజమాన్యం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం తో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని కంపెనీ మూసివేయాలని ఆందోళనకు దిగారు.  

గాయపడ్డ కార్మికులను భువనగిరి ఆసుపత్రికి తరలించడంతో వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ఎక్స్క్లూజివ్ కంపెనీలను యాదాద్రి జిల్లా నుండి పూర్తిగా తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. గత సంవత్సరం క్రితమే గోదావరి ఎక్స్ప్రెస్ వి కంపెనీలో రియాక్టర్ పేలి నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సంఘటన మరో ముందే ఈ సంఘటన జరగడం దురదృష్టకరం ఈ రెండు కంపెనీల యాజమాన్యం ఒకటే కావడం కార్మికులకు భద్రత చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడంతోనే ఈ సంఘటన జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రమాద సంఘటన తెలియగానే డిసిపి యాదవ్, పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని జరిగిన వివరాలను సేకరించారు.