- వణికిన టిబెట్, నేపాల్
- ఆరుసార్లు కంపించిన భూమి
- అనేక భవనాలు నేలమట్టం
126 మంది మృతి
- ఎటు చూసినా బాధితుల ఆర్తనాదాలే
- 2015ను గుర్తుకు తెచ్చుకుంటున్న జనం
- భారత్‌లోనూ ప్రకంపనలు
న్యూఢిల్లీ, జనవరి 7: హిమాలయ దేశాలు టిబెట్, నేపాల్‌లలో భూకంపంతో వణికిపోయాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు మీద 7.1గా నమోదైంది. నేపాల్- టిబెట్ సరిహద్దుల్లో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. భూకంప కేంద్రం ప్రఖ్యాత ఎవరెస్ట్ శిఖరానికి 80 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్లు (6.2 మైల్స్) లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
భూప్రకంపనలు భారత్, బంగ్లాదేశ్, చైనా, భూటాన్‌లకు కూడా వ్యాపించాయి. కానీ నేపాల్, టిబెట్ దేశాలు మినహాయిస్తే మిగతా దేశాల్లో పెద్దగా నష్టం జరగలేదు. చైనా మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ భూకంపం ధాటికి 1౨6 మంది చనిపోయారు. మరో 1౮౮ మంది గాయపడ్డారు.
దాదాపు 3వేల వరకు ఇళ్లు నేలమట్టం అయినట్లు చైనా మీడియా పేర్కొంది. భూకంపానికి సంబంధించి వందల కొద్దీ వీడియోలను ఎక్స్ యూజర్లు షేర్ చేశారు. జనాలు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగెత్తుతున్న దృశ్యాలు ఇందులో కనిపిస్తున్నాయి.
బెడ్ ఊగింది..
నేపాల్ రాజధాని ఖాట్మాండు భూకంప కేంద్రానికి కేవలం 400 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దీంతో ఆ నగరంలో భూప్రకంప నల ధాటికి అంతా వణికిపోయారు. ఖాట్మాం డు నగరంలోని ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘నేను నిద్రలో ఉన్నా. బెడ్ ఊగుతోంది. మా పిల్లలు ఊపుతున్నారని అనుకుని.. అంతగా పట్టించుకోలేదు. కానీ తర్వాత కిటికీ కూడా ఊగడంతో భూకంపం వస్తోందని నిర్దారించుకున్నా. గాబరాపడుతూ.. మా పిల్లల్ని పిలిచి వెంటనే ఇల్లు ను ఖాళీ చేశా’ అని మీడియాకు తెలిపాడు.
మొదట 7.1 తీవ్రతతో..
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. మొదట నేపాల్ సరిహద్దులో ఉన్న క్సిజాంగ్ నగరంలో ఉదయం 6.35కి 7.1 తీవ్రతతో భూమి కంపించింది. ఇది చాలా పెద్ద భూకంపం. ఆ తర్వాత వరుసగా 6.8,4.7,4.9 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. భూకంపం సంభవించిన ప్రాంతం హిమాలయాల్లోని ఎవరెస్టు శిఖరానికి అతిదగ్గరగా ఉంది.
2015లో కూడా నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. ఆనాటి ఘటనలో 9 వేల మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 22 వేల మంది క్షతగాత్రులయ్యారు. గోర్ఖా భూకంపంగా ఈ ఘటనను పిలుస్తున్నారు. నాడు కూడా ఒకే రోజు ఒక్కటి కంటే ఎక్కువ సంఖ్యలో భూకంపాలు సంభవించాయి.
కారణం ఏంటంటే??
ఈ భూకంపం రావడానికి ప్రధాన కారణం టెక్టానిక్ ఫలకాల్లో చోటు చేసుకున్న మార్పులు, ఇండియా-యురేషియా టెక్టానిక్ ప్లేట్స్ మధ్య జరుగుతున్న ఘర్షణలు. గత రికార్డులను పరిశీలించినా కానీ గడిచిన దశాబ్దంలో ఈ రీజియన్‌లో అనేక భూకంపాలు సంభవించాయి.
ప్రస్తుతం భూకంపం సంభవించిన లాసా రీజియన్ టిబెట్‌కు భూగోలికంగా ఎంతో ముఖ్యమైన ప్రదేశం. పరిస్థితి ఇలాగే కొనసాగితే హిమాలయ దేశంలో భవిష్యత్‌లోనూ భూకంపాలు సంభవించే ప్రమాదం లేకపోలేదు. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్స్ వల్లే హిమాలయాలు ఏర్పడ్డాయి. కానీ నేడు మాత్రం ఆ ప్లేట్స్ మధ్యే కొలీజన్స్ జరుగుతున్నాయి.
భారత్‌లోనూ కంపించిన భూమి
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో వచ్చిన భూప్రకంపనల తాకిడికి భారత్‌లోనూ భూ మి కంపించింది. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు పలువురు పేర్కొంటున్నారు. అయితే అదృష్టవశాత్తూ ప్రాణనష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించలేదు.
దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దేశరాజధాని ఢిల్లీలో మాత్రమే కాకుండా బీహార్ రాజధాని పాట్నాలో కూడా ప్రకంపనలు వచ్చాయి. పశ్చిమబెంగాల్, అస్సాంలలోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది.
ట్రెండింగ్‌లో నేపాల్‌ఎర్త్‌క్వేక్
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భూకంపం సంభవించడంతో అనేక మంది యూజర్లు ఎక్స్‌లో భూకంపానికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశారు. దీంతో హ్యాష్ ట్యాగ్ నేపాల్ ఎర్త్‌క్వేక్ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఉదయం 6.35 ప్రాంతంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ధృవీకరించింది.
టిబెట్‌లో రెండో అతిపెద్ద నగరమైన షిగేట్స్‌లో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు చైనా అధికారులు రికార్డు చేశారు. ఆ తర్వాత కొద్ది విరామంలోనే 4.7, 4.9 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. ప్రస్తుత భూకంప కేంద్రం ఉన్న పరిసరాల్లో గడిచిన 5 సంవత్సరాల్లో 29 సార్లు భూమి కంపించింది.