సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్.వీరయ్య
సంగారెడ్డి, జనవరి 17 (విజయ క్రాంతి): రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు రావాల్సిన అవసరముందని, ఆ దిశగా సంగారెడ్డిలో జరగ్నబోయే సీపీఐఎం రాష్ట్ర 4వ మహాసభల్లో సమరశీల పోరాట కర్తవ్యాలను రూపొందించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణ లో ఉన్న కేవల్ కిషన్ భవన్లో నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు, జ్యోతితో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వీరయ్య మాట్లాడారు.
బీఆర్‌ఎస్ తొమ్మిదిన్నరేళ్లు, బీజేపీ పదేళ్లు, కాంగ్రెస్ 13 నెలల పాలలు పాలించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఓటర్లుగా మాత్రమే చూశాయని ఏనాడూ వారిని ప్రజలుగా గుర్తించలేదన్నారు. ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చేందుకు దోహదపడే ఏ ఒక్క మంచి నిర్ణయం, పథకాలు అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న కోటీ 30 లక్షల మంది కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.
కేంద్రంలోని ప్రధాన మంత్రి మోడీ మాత్రం రోజుకు రూ.178 రూపాయల వేతనం సరిపోతుందంటూ జీవో జారీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు అంటూ రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇండ్లంటూ కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేయడం తప్ప ఏ ఒక్క పేదకు ఇళ్లు కట్టించిన పాపాన పోలేదన్నారు. విద్చ, వైద్యం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లడం వల్ల పేద, మద్యతరగ్నతి ప్రజలకు అవి అందని ద్రాక్షలా మారాయన్నారు.
రాష్ట్రంలో వివిద శాఖల్లో 3 లక్షల వరకు ఉద్యోగాల ఖాళీలున్నాయని, జాబ్ క్యాలెండర్ మొక్కుబడిగా తప్ప చిత్తశుద్ది లేదన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కరాములు, పార్టీ జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, ఎం.అడివయ్య పాల్గొన్నారు.