సమస్యల పరిష్కారం దిశగా సీఎంల చర్చలుండాలి
పరస్పర సహకారంతోనే సమస్యలకు పరిష్కారం
విభజన హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు హైదరాబాద్‌లో సమావేశమై రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ సీఎం ’విభజన హామీల’ అమలు విషయంలో ఆగమైన తెలంగాణ తరఫున దృఢమైన వాణి వినిపిస్తారని తెలంగాణ పౌర సమాజం ఆశిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం సాధించుకునే క్రమంలో రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం’ వాస్తవ రీతిలో సీమాంధ్ర రాజకీయ, సామాజిక, ఆధిపత్య శక్తుల ప్రయోజనాలే ధ్యేయంగా రూపొందించబడింది. బాధితుల పక్షాన ఈ చట్టం నిలబడలేదన్నది వాస్తవం. ఈ పరిస్థితుల్లో విభజన హామీల మీద ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చకు కూర్చోవడం ఆహ్వానించదగ్గ విషయమే. ఈ కలయిక ప్రతికూల చర్చకు తావులేకుండా సమస్యల పరిష్కారం దిశగా చొరవ చూపాలని తెలంగాణ పౌర సమాజం బలంగా ఆకాంక్షిస్తుంది.
* కృష్ణా-గోదావరి నదులను స్వాధీనపరుచుకొనేందుకు ౨౦౨౧, జూలై- 15న కేంద్ర జలవనరుల శాఖ విడుదల చేసిన గెజిట్‌ను ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీటి పంపిణీలో తెలంగాణ ఆక్షాంక్షలను పూర్తిగా నిరాకరించింది. సహజన్యాయ సూత్రాలకు విరుద్ధంగా, సీమాంధ్ర కోసం నీటిని కేటాయించాలని చూస్తున్నది. ఈ రెండు నదులను కేంద్రం ఆక్రమిస్తే హైదరాబాద్‌తోపాటు తెలంగాణ గొంతు ఎండిపోతుంది. తెలంగాణ ప్రజలు తిరిగి వలస కూలీలుగా మారుతారు. నదులను కేంద్రం ఆధీనంలోకి తీసుకోవడం ఏపీ ప్రయోజనాలకు కూడా నష్టమే. అందువల్ల గెజిట్‌ను ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి రద్దు చేయించాలి.
* అక్రమ నీటి తరలింపునకు అడ్డుకట్ట పడాలి. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అక్రమంగా 670 టీఎంసీల క్రిష్ణా జలాలను తరలించుకొని పోయింది. అందుకు నిల్వ చేసుకోవడానికి కావాల్సిన రిజర్వాయర్లను కూడా పూర్తి చేసుకుంది. తాత్కాలిక లెక్క ప్రకారం ఆంధ్ర 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు వాడుకోవాలి. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఏనాడూ 240 టీఎంసీల మించి వాడుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీల్లో సహజ న్యాయ సూత్రాల ప్రకారం తెలంగాణకు 50 శాతం వాటా దక్కించుకునే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కృషి చేయాలి.
* పోలవరం పేరుతో ఆదివాసులను బలిపెట్టడం అన్యాయం. కావున ఏపీలో కలిపిన తెలంగాణలోని ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో కలుపుకునేలా, ఆదివాసులను పరిరక్షించేలా చర్చలు సాగాలి. జీవో నం.19/2014 పేరుతో 17 జూలై 2014న బయటకు వచ్చిన 29 మే 2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ ఆర్డినెన్స్ ద్వారా పోలవరం ప్రాజెక్టు కోసం ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయటం అన్యాయం. ఆ మండలాలను తిరిగి తెలంగాణలో కలుపుకునేలా రెవంత్‌రెడ్డి చొరవ చూపాలి.
* చట్టం ఆమోదించిన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యాన్ని వీడి యుద్ధ ప్రాతిపదికన హామీలను అమలు పర్చేలా చర్చించాలి.
* ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ కోసం 331 ఎకరాలు కేటాయించినప్పటికీ, 10 ఏళ్లలో ఒక్క అడుగు కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వేయలేదు. కావున కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెడుతున్న ఏపీ సీఎం నుంచి తెలంగాణ సీఎం ఈ అంశంపై సహకారం తీసుకోవాలి.
* బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు చొరవ చూపాలి. పునర్విభజన చట్టంలో భాగంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ గత పదేళ్లలో కేంద్రం కనీసం అటు వైపుగా అడుగు కూడా వేయలేదు. పొరుగు రాష్ట్ర సీఎంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం చంద్రబాబు సహకరించాలి. విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి మద్దతు తెలిపాలి.
* రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై చర్చించాలి. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని విభజన హామీలో కేంద్రం స్పష్టంగా చెప్పింది. 9 ఏళ్లు నాన్చి కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా, వ్యాగన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ప్రధాని కాజీపేటలో శంకుస్థాపన చేశారు. ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎన్డీయేలో భాగస్వామి అయిన ఏపీ సీఎం సహకారం అందించాలి.
* పోలవరంలాగా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించేందుకు సహకరించాలి. తెలంగాణలో ఏదైనా ఒక నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని విభజన హామీల్లో కేంద్రం చెప్పింది. ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి, తెలంగాణలో ఏ ప్రాజెక్టుకూ ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించేలా ఎన్డీయేలో ముఖ్య భూమిక పోషిస్తున్న చంద్రబాబు చొరవ చూపాలి.
* వెనుకబడిన తెలంగాణ జిల్లాల అభివృద్ధికి రేవంత్ ప్రయత్నించాలి. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఏటా రూ.450 కోట్ల చొప్పున నిధులు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ రెండుమూడేండ్లు మాత్రమే ఇచ్చి ఆపేసింది. ఇరువురు సీఎంలు పరస్పర సహకారంతో నిధులు మంజూరు అయ్యేలా చూడాలి.
* ఉద్యోగుల పరస్పర మార్పిడి జరగాలి. పదేళ్లుగా తెలంగాణ భూమి పుత్రులు ఆంధ్ర ప్రాంతంలో ఉద్యోగాలు చేస్తున్నారు. వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయి. వారిని ఇక్కడికి తీసుకొచ్చేలా, అదేవిధంగా తెలంగాణలో ఉన్న ఆంధ్రా ఉద్యోగులను ఆంధ్రకు తరలించేలా చర్చలు జరగాలి.
* విద్యుత్ రంగ సమస్యల పరిష్కారానికై ’నీరజా మాథుర్’ ఏర్పాటుచేసిన కమిటీ రిపోర్ట్‌లో ఇప్పటికి స్పష్టత లేదు. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన,స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి వాటి విభజన అసంపూర్తిగానే ఉంది. ఇప్పటికైనా ఇరు రాష్ట్రాల పెద్దలు పరస్పరం ఆమోదమైన పరిష్కారానికి ప్రయత్నించాలి.
* ఐటీఐఆర్ ప్రాజెక్టు ఇవ్వాల్సిందే. తెలంగాణకు రావాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా గుజరాత్‌కు తరలించుకుపోయింది. తిరిగి ఈ ప్రాజెక్టు తెలంగాణకు కేటాయించేలా ఏపీ ముఖ్యమంత్రి చొరవ చూపాలి.
* సింగరేణిని కాపాడాలి. తెలంగాణ ఉద్యమానికి వేగుచుక్క సింగరేణి. సింగరేణిపై కార్పొరేట్ దృష్టి పడడంతో ఈ బొగ్గు గనులను ప్రైవేటీకరించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. ఇప్పటికే సింగరేణి ఉద్యోగాల సంఖ్య సగానికి సగం పడిపోయింది. ఏపీలో విశాఖ ఉక్కు, కేజీ బేసిన్ గ్యాస్ హక్కుల విషయంలోనూ ఇదే పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం చర్యలను ప్రతిఘటించేలా ఇరు రాష్ట్రాల సీఎంలు గట్టిగా కృషి చేయాలి.
తెలంగాణ విద్యావంతుల వేదిక