calender_icon.png 13 October, 2024 | 11:50 PM

బీఆర్‌ఎస్ నేత క్రిశాంక్‌కు మెయిన్ హార్ట్ లీగల్ నోటీసులు

13-10-2024 09:19:06 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): మూసీ ప్రాజెక్టు కన్సల్టెన్సీ విషయంలో నిరాధార ఆరోపణలు చేశారంటూ బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు మెయిన్‌హార్ట్ సంస్థ లీగల్ నోటీసులు జారీ చేసింది. ఉద్దేశ్యపూర్వకంగా తమ సంస్థ ఇమేజ్‌ను దెబ్బతినేలా ఆరోపణలు చేశారని పేర్కొంది. క్రిశాంక్ తన వ్యాఖ్యలను 24 గంటల్లోపు ఉప సంహరించుకుని క్షమాపణలు చెప్పాలని, ఎక్స్‌లో పెట్టిన పోస్టులను తొలగించాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో న్యాయపరంగా ముందకు వెళతామని ఆ సంస్థ హెచ్చరించింది. ఈ సందర్భంగా నోటీసులకు క్రిశాంక్ స్పందిస్తూ మూసీ కాంట్రాక్టుపై ఎక్స్ పోస్టులను తొలగించే ప్రసక్తిలేదని స్పష్టం చేవారు.

నోటీసులు విషయమై పార్టీ పెద్దలతో చర్చించినట్లు తెలిపారు. సింగపూర్ కంపెనీ ఇచ్చిన నోటీసులకు తమ పార్టీ లీగల్ సెల్ సమాధానం ఇస్తుందన్నారు. రూ. 3 వేల కోట్ల కుంభకోణంలో మెయిన్‌హార్ట్‌కు పాకిస్తాన్ రెడ్ వారెంట్ నోటీసులు జారీ చేసిన సంగతి నిజం కాదా, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నిషేధించింది వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, మూసీ కాంట్రాక్టర్ సింగపూర్ కంపెనీ నోటీసులకు, పోలీసు కేసులకు భయపడబోమని కుండబద్దలు కొట్టారు. రూ.3 వేల కోట్ల కుంభకోణంలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన మెయిన్ హార్ట్‌కు మూసీ మాస్టర్ ప్లాన్ తయారీ కాంట్రాక్టు ఏ విధంగా ఇస్తారని ఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదివారం ఎక్స్ వేదికగా క్రిశాంక్ నిలదీశారు.