శాసనాలలో ప్రతిమాలక్షణాలు చెప్పడం అరుదు. మైలారదేవుని ప్రతిమాలక్షణాన్ని వివరించింది. నడిగూడెం శాసనం. అరుదైన మైలారదేవుని ప్రతిమాలక్షణం ఈ శాసనంలోని శివస్తుతిలో భాగంగా వివరించబడింది. ఈ శాసన కవికి శిల్పశాస్త్ర పరిచయమున్నట్టు ఈ వివరణే సాక్ష్యం చెప్తున్నది. ఈ శాసనంలో భక్తుల కోరిక మేరకు అవతరించిన శంభు మైలారదేవుడు ‘త్రిశూలం, పానపాత్ర, తీక్ష ఖడ్గం, ఢమరుకాలు’ ధరించి కనిపిస్తాడని ప్రతిమాలక్షణ వివరణ ఉంది. చాముండి దేవతకు పురుషరూపమే అన్నట్టు మైలారుదేవుడుగా కనిపిస్తాడు. ‘వామహస్తే త్రిశూలం కనకమయ సుధాపానపాత్రం ద్వితీయ్యే భిభ్రాణం తీక్ష ఖడ్గం శ్రిత దశమ పరే దైత్యనాశైక హేతుర్నానారత్నౌఘ.. భే బద్ధం ఢమరుగ పరే చారుగంభీరనాదం భక్త స్వేష్టార్థం సిద్ధు జయంతి కులపతి శంభు మైలార దేవః (నల్లగొండ శాసన సంపుటి శా.సం.99, పే.284, నడిగూడెం)
మైలారు దేవుని ధ్యానమంత్రంలో
‘నీలం జీమూతవర్ణం సకల మోహనమయం త్రిశూల ఢమరుక ఖడ్గ పాశ పాత్రం త్రిలోచనం ఉగ్రదంష్ట్రం వపుర్బీమం బిభ్రతి భమణి ప్రభం సపక్తి గుత్వా సర్వం రక్షాదేడౌహరా యుద్దే మహాబలం’ అని ఉంది. ఈ ధ్యానం భైరవ ప్రతిమాలక్షణాలను పోలి ఉంది. నడిగూడెం శాసనంలోని ప్రతిమాలక్షణాలు మైలారుదేవుని ధ్యానమంత్రంతో సరిపోలుతున్నాయి. దక్కన్ ప్రాంతంలో మైలారుదేవుడు మల్లన్న, మల్లిఖార్జునుడు, మల్హరరాయుడు, ఖండేల్రాయుడు, ఖండోబా, మున్నీశ్వరన్ అని పిలువబడుతాడు. మైలారు దేవుణ్ణి తెలంగాణలో మల్లన్న, కర్ణాటకలోమల్లారి, మార్తాండభైరవ, మహారాష్ట్రలో ఖండేరావు, ఖండోలా, మల్లుఖాన్ అని కూడా పిలుస్తారు.
చెన్నపట్నం ప్రాచ్యలిఖిత గ్రంథ భాండాగారంలోని ఒక రాతప్రతి ‘కర్ణకులీనుల ఘన చరిత్ర’లో ‘రుషుల్ ప్రమథులు గొల్వ తేకువ మాళవిదేవితో గూడి తిరమొప్ప మల్లారిదేవుడుం’ అని ఆ వంశకర్త వీరమల్లు పరశురాముని యుద్ధగాథ సందర్భాన చెప్పారని గజపతిరాయవర్మ రాసిన వ్యాసంలో ఉంది. (భారతి, ఫిబ్రవరి 1960) క్రీడాభిరామంలో.. ‘శనివారసిద్ధి సజ్జన పారిజా తంబు వరదాతి యాదిత్యవారభోగి మాడచీరమణుండు మాయావినోదుండు మాళవీ ప్రియభర్త మహితయశుడు పల్లెంబనాయకుండెల్ల వేల్పులరాజు గనపవేట వేడ్కకాండ్రభర్త కత్రశాలస్వామి కరుణాపయోరాశి పుణ్యకీర్తనుడైన వ్రోలిమ య్య మంచు కుంచాల గొలువం మాయకాళ్ళ
బట్టి కట్టంగ నేర్చిన బాసవెల్లి
భైరవుని తోడిజోడు మైలారదేవు
డోరుగంటి నివాసి మేలొసగుగాత..’
జోడు దేవతల పేర్లు కాకతీయుల కాలంలోనే వున్నట్లు క్రీడాభిరామం పేర్కొంటున్నది. ‘కాకతమ్మకు సైదోడు ఏకవీర’ అన్నట్లే ‘భైరవునికి తోడిజోడు మైలారుదేవుడు’ అనడం చూడగలం. శివావతారమైన భైరవుడు, కొందరికి కుల దైవం, ప్రాంతీయ దైవమైన మైలారుదేవుడు శైవమతావలంబుల ఆరాధ్యదైవాలు.
కురుబల, గొల్లల దేవుడు మల్లన్న. కులపురాణాల ప్రకారం మల్లన్న నల్లమల అడవులలో శ్రీశైలం సమీపంలో జన్మించిన శివావతారుడు. మల్లన్న కొందరికే, మైలారుదేవుడు పెక్కుమందికి దేవుడు. కాకతీయుల కాలంలో మైలారుదేవుడు ఓరుగంటి నివాసి. ఇప్పటికి వరంగల్లులో మల్లన్న గుడి.. (ఆజంజాహీ మిల్స్ ప్రాంతంలో) కట్టమల్లన్నగా పిలుస్తుంటారు. అక్కడ ఎర్రగొల్లలే పూజారులు.
ఐలేని(అయ్యన్నవ్రోలు)లో మల్లన్న, మైలారుదేవుడుగా కొలువబడుతున్నాడు. కొందరు ఖండేరావు అని కూడా పిలుస్తారు. మైలారుదేవునికి ఇద్దరు భార్యలు. గొల్లకేతమ్మ, మేడలదేవి అని చెప్తారు. కాకతీయులు వేల్పుగొండవారా? అని కొందరు చరిత్రకారులు అనుమానించే వెల్పుగొండ మెదక్ జిల్లాలో ఉంది. మైలారదేవుడు కళ్యాణీ చాళుక్యుల వెల్పుగొండ శాసనంలో ప్రస్తావించబడ్డాడు. కాని గుడిలో ఉన్న శిల్పం వేరు. ఇక్కడ వర్ణించిన ప్రతిమాలక్షణాలకు భిన్నంగా ‘మల్లన్న’ దేవుని లెక్కనే అగుపిస్తడు.
కర్ణాటకలో ఆరాధించేటువంటి రూపంలో అంటే అయినవోలులోని మల్లన్న వలె గడ్డం ఉంది. ఆయుధదారి కాడు, కుడిచేతిలో అక్షమాల(జపమాల) ఉంది. కూర్చుని ఉన్న స్వామి ఎడమతొడపై గంగి మల్లవ్వ, తుప్పాద మల్లవ్వలున్నారు. చాముండి దేవతా శిల్పాన్ని గ్రామాల్లో గ్రామ దేవతలకు బదులుగా నిలుపుతున్నారు. గ్రామ దేవతల్లో పోచమ్మ ప్రతి గ్రామంలో ఉండే అమ్మదేవత. ఒగ్గుపూజారులు పోచమ్మదేవత మైలారుదేవుని అక్క అని చెప్తారు. మైలారుదేవుడు లేదా మల్లన్న ఉండే ప్రతిచోట పోచమ్మ దేవతకు గుడులుండడం సంప్రదాయం. కొమురవెల్లి మల్లన్న దేవస్థానం పక్కనే కొండ పోచమ్మ దేవతకు గుడి ఉంది. రెండు తప్పకుండా అక్కడే ఉన్న పోషమ్మకు బోనాలు పెట్టడం ఆచారంగా ఉంటుంది.
తెలంగాణ ప్రజలకు పెద్దదేవుడు మల్లన్నే. ప్రతి గ్రామంలో మల్లన్నకు ‘మల్ల పట్నాలు, మల్లన్న బోనాలు, మల్లన్న పండుగలు, మల్లన్న జాతరలు’ జరుపుతారు. జానపదుల దేవుళ్ళే విశిష్ట అంశంగా కాదు సాక్షాత్తు శివుడిగానే భావించి కొలుస్తారు. భైరవుడు, వీరభద్రుడు శివుని ఉగ్రరూపాలుగా, శివాంశకల దేవుళ్ళుగా కొలుస్తారు. జ్యోతిర్లింగ స్థానాలలెక్క తెలంగాణలో మల్లన్న పీఠాలున్నాయి. వందల సంఖ్యలో ఉన్న మల్లన్న గుడులలో ప్రధానంగా పదిహేడు ప్రదేశాలను మల్లన్న క్షేత్రాలుగా కొలుస్తారు. చిన్న పిల్లలను ఉయ్యాలూపుకుంట పాడేపాట జానపదగీతం ‘ఉయ్యాల.. జంపాల.. కొత్తకొండ మల్లన్న, కొమురెల్లి మల్లన్న, యేములాడ రాజన్న’ మల్లన్న క్షేత్రాలను ఈ పాటలో తలుచుకుంటారు.
తెలంగాణలో కొత్తకొండ, కొమురెల్లి (సిద్ధిపేట జిల్లా), అయినవోలు (వరంగల్ శివారు), గట్టు మల్లన్న (వరంగల్ నగరం), ఓదెల(పెద్దపల్లి జల్లా), వేలాల (మంచిర్యాల జిల్లా), పెద్దపురం(జగిత్యాల జిల్లా), రేకులకుంట (సిరిసిల్లా జిల్లా), పెద్ద(గొల్ల), గట్టు (సూర్యా పేట జిల్లా), శ్రీశైలం, నాందేడ్, వేములవాడ, కురవి, ధర్మపురి, ఇందూరులు ప్రధానమైన మల్లన్న క్షేత్రాలు. మల్లన్న కురుమ, గొల్లల దేవుడన్నది సంప్రదాయం. వారు చేసే మల్లన్న పండుగలు, జాతరలలో తెలంగాణ ప్రజలందరు పాల్గొని, మొక్కులు చెల్లించుకుంటారు. బండారి(పసుపు) ప్రసాదం స్వీకరిస్తారు. పూజారులందరు ఒగ్గులే. ఒగ్గుకథ పురాతన ప్రదర్శనాత్మక జానపద కళారూపం. సాంప్రదాయికంగా పురాజాతి సంస్కృతి.
కొత్తరాతియుగంలోని పశుపాలక, వ్యవసాయిక గణాల నుంచి ఎదిగొచ్చిన జాతి నాగరికతా, సంస్కృతి ఇది. దైవ భావన, ఆరాధనా సంప్రదాయాల పరిణతి చరిత్ర. తెలంగాణ సమాజంలో శైవమత పరిణామాల అనేక సాంస్కృతిక వైవిధ్యా లకు దారితీస్తాయి. ఎప్పటికప్పుడు చోటు చేసుకున్న కొత్త ఆరాధనారూపాలు. వాటి చుట్టు రచింపబడ్డ కొత్త ఆధ్యాత్మిక భావజాలం తెలంగాణ సమాజం మీద గొప్ప చారిత్రక పరిణామలకు కారణమయ్యాయి.