- అక్రమ మైనింగ్ పనులు నిలిపివేయాలని నిరసిస్తూ గ్రామస్తుల రిలే నిరాహార దీక్షలు.
- భగ్నం చేస్తూ తెల్లవారుజామునే రైతులను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు.
- అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్
పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించిన గ్రామస్తులు.
- గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు.
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామంలో మైనింగ్ లొల్లి మళ్లీ మొదలైంది. తమ గ్రామం పూర్తిగా మైనింగ్ మాఫియా చేతిలోకి వెళ్లిందని తద్వారా తమ మునుగడ పూర్తిగా ప్రశ్నార్ధకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ గ్రామస్తులు పలుమార్లు ఎన్నికలను సైతం బహిష్కరించారు. గత ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వాలు ఏవి పట్టించుకున్న పాపాన పోలేదని నిరసిస్తూ సోమవారం గ్రామస్తులంతా రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. దీంతో పోలీసులు ఉదయం 4 గంటల నుంచి గ్రామంలోకి చొరబడి రైతులను అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమ పంట పొలాల్లో వేసుకున్న పంట రక్షణ కోసం పనిచేస్తున్న తమ భర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తే పంటల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అక్రమంగా మైనింగ్ అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం వెంటనే రద్దు చేస్తూ గ్రామాన్ని కాపాడాలని ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికలను సైతం గ్రామస్తులు బహిష్కరించినప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోవడం దారుణమని అందుకు నిరసనగా గ్రామస్తులు శాంతియుత రిలే నిరాహార దీక్షలకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. గ్రామంలోకి పోలీసులను అడుగుపెట్టనీయకుండా మహిళలు రోడ్డుపై కంచె ఏర్పాటు చేయడం ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులకు తావునిస్తోంది. రైతులను వెంటనే విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. తమ గ్రామస్తులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామంలోని ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని గ్రామస్తులు నిలువరించారు.