న్యూఢిల్లీ, డిసెంబర్ 3 : ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం), ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లు ‘6ఈ’ ట్రేడ్‌మార్క్‌పై జగడానికి దిగాయి. ఎం అండ్ ఎం తాజాగా బీఈ 6ఈ, ఎక్స్‌ఈవీ 9ఈ పేర్లతో రెండు ఎలక్ట్రిక్ వాహనాల్ని విడుదల చేయగా, తమ డిజిగ్నేటర్ కోడ్‌గా 6ఈ ఉపయోగిస్తున్నామని, ఆ ట్రేడ్ మార్క్‌ను ఎం అండ్ ఎం వాడరాదని వివాదాన్ని రేపింది.
గత 18 ఏండ్లుగా 6ఈ మార్క్ ఇండిగో ఇడెంటిటీలో అంతర్గత భాగమని, ఈ ట్రేడ్‌మార్క్‌కు అంతర్జాతీయంగా పటిష్టమైన గుర్తింపు ఉన్నదని ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ వాదిస్తున్నది. తాము అందించే అన్ని రకాల విమాన సేవలకు ‘6ఈ’ట్రేడ్ మార్క్‌ను విస్త్రతంగా ఉపయోగిస్తామని ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
అనధికారికంగా 6ఈ మార్క్‌ను ఏ రూపంలో వాడినా, ఇండిగో హక్కులకు, ప్రతిష్ఠకు భంగం కల్గించినట్లేనని పేర్కొంది. తమ మేథోసంపత్తి ఆస్తిని, బ్రాండ్ ఇడెంటిటీని పరిరక్షించుకునేందుకు అన్ని రకాల చర్యలనూ తీసుకుంటామని హెచ్చరించింది.
చర్చలు జరుపుతున్నాం: ఎం అండ్ ఎం
ట్రేడ్ మార్క్ వివాదానికి సామరస్య పరిష్కారాన్ని అన్వేషించడానికి ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌తో చర్చలు జరుపుతున్నట్లు మహీం ద్రా అండ్ మహీంద్రా మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలి పింది. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఆందోళనల్ని పరిగణనలోకి తీసుకున్నామని, ఆ సంస్థ గుడ్‌విల్‌కు భంగం కల్గించాలన్నది తమ ఉద్దేశ్యం కాదని, తగిన పరిష్కారం కోసం వారితో చర్చలు జరుపుతున్నట్లు ఆటోమొబైల్ కంపెనీ వివరించింది.
తమ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోలోని క్లాస్12 వాహనాలకు ‘బీఈ 6ఈ’ ట్రేడ్‌మార్క్ కోసం తాము దరఖాస్తు చేసినట్లు ఎం అండ్ ఎం తెలిపింది. మహీంద్రా మార్క్ ‘బీఈ 6ఈ’పై వివాదం ఏదీ లేదని తాము భావిస్తున్నామని తెలిపింది. వివరించింది. ట్రేడ్‌మార్క్ ఉల్లంఘించినందుకు ఎం అండ్ ఎంపై ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ దావా వేసినట్లు తాజా వార్తలు వెల్లడిస్తున్నాయి.