25 May, 2026 | 4:25 AM

మహిళా రిజర్వేషన్ల తక్షణ అమలుకు పోరాడుతాం

25-05-2026 12:00 AM

మొయినాబాద్ మహాసభలో మహిళా కాంగ్రెస్ తీర్మానం

మొయినాబాద్, మే 24 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, మహిళా రిజర్వేషన్ల తక్షణ అమలు మరియు పెరిగిన ఇంధన ధరలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాలని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ మహాసభ పిలుపునిచ్చింది.

ఆదివారం మొయినాబాద్లో నిర్వహించిన ఈ సభకు రాష్ట్ర, జిల్లా ముఖ్య నాయకులు హాజరై, మహిళల రాజకీయ భాగస్వామ్యం మరియు ప్రజా సమస్యలపై కీలక తీర్మానాలు ఆమోదించారు.  మహాసభ కార్యక్ర మానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు  ఎర్రబెల్లి స్వర్ణ, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు & టీయూఎఫ్‌ఐడీసీ ఛైర్మన్ చల్లా నరసింహారెడ్డి, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్, చేవెళ్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీంభరత్, శేరిలింగంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే జగదీశ్వర్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.

సమావేశంలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా  రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి భీంభరత్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోని 542 లోక్సభ స్థానాల్లోమహిళలకు 33 శాతం కోటాను తక్షణమే అమలు చేయాలని, రాజకీయ భాగస్వామ్యం కల్పిస్తామన్న హామీని కేంద్రం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

ఇతర రాష్ట్రాల్లో ’ఎస్‌ఐఆర్’ పేరుతో జరుగుతున్న ఓటర్ల తొలగింపు కుట్రలను ప్రస్తావిస్తూ, తెలంగాణలో అలాంటి ప్రయత్నాలు జరిగితే మహిళా కాంగ్రెస్ ఊరుకోదని, పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.  పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో సామాన్యులను దారిద్య్రంలోకి నెడుతున్నారని, ప్రజాపక్షాన కాంగ్రెస్ పార్టీ చేపట్టే ప్రతి పోరాటానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.

‘కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాబోయే రోజుల్లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకత్వంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. అని ఆమె పేర్కొన్నారు.తమకు నిరంతరం సహకరిస్తున్న మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి, పార్టీ శ్రేణులకు మరియు సీఎం రేవంత్ రెడ్డికి ఆమె ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లా నలుమూలల నుండి భారీ సంఖ్యలో మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.