calender_icon.png 25 December, 2024 | 10:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహేశ్‌కే పీసీసీ

07-09-2024 12:23:48 AM

  1. బీసీ బిడ్డకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి 
  2. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన అధిష్ఠానం

ఉత్తర్వులు జారీ చేసిన ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ 

సీఎం రేవంత్‌కు సన్నిహితుడిగా గుర్తింపు

విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం మొదలు 

పార్టీని నమ్ముకున్నందుకు దక్కిన పెద్ద పదవి

హైదరాబాద్/నిజామాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): విధేయతకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పట్టం కట్టింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ( టీపీసీసీ) అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్‌ను అధిష్ఠానం ప్రకటించింది. సుధీర్ఘ చర్చల అనంతరం కాంగ్రెస్ హైకమాండ్ బీసీ నేతకు రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు అప్పగించింది. మధుయాష్కీ గౌడ్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ బలరామ్ నాయక్ పోటీలో ఉన్నా.. విధేయతకు పెద్దపీట వేసింది.

విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్‌లో పనిచేస్తున్న మహేశ్ కుమార్‌ను టీపీసీసీ చీఫ్‌గా ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి రెండు వారాల క్రితమే నూతన చీఫ్‌ను ఫైనల్ చేసిన ఏఐసీసీ తాజాగా ప్రకటించింది. మహేశ్ నియామకం ద్వారా బీసీలకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తుందన్న సంకేతాలను హైకమాండ్ పంపింది. 1986 నుంచి ఎన్‌ఎస్‌యూఐ నేతగా, యువజన నాయకుడిగా, కాంగ్రెస్‌లో వివిధ పదవులు నిర్వహించిన ఆయనకు పార్టీ నిర్మాణంపై సంపూర్ణ అవగాహన ఉంది. మహేశ్ కుమార్ ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

రెండు నెలలుగా మేధోమథనం..

ఇదివరకు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి పదవీకాలం జూలై 7తో ముగిసింది. అప్పటినుంచి టీపీసీసీ చీఫ్ ఎవరన్న దానిపై అధిష్టానం మేధోమథనం చేసింది. కొత్త చీఫ్ ఎంపికపై ఢిల్లీలో పలుమార్లు ఏఐసీసీ నిర్వహించిన మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో రెండు నెలల చర్చల తర్వాత రాజకీయ, సామాజిక సమీకరణాలను పరిశీలించిన అధిష్ఠా నం.. ఎట్టకేలకు మహేశ్ కుమార్‌ను ఫైనల్ చేసింది.

రేవంత్‌కు సన్నిహితుడిగా..

మహేశ్ కుమార్‌కు పార్టీలో వివాదరహితుడిగా పేరుంది. ఆయన సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. పార్టీలో సుధీర్ఘకాలం పనిచేస్తున్న నేపథ్యంలో సీనియర్ నేతలు ఉత్తమ్, భట్టి, కోమటిరెడ్డితో పాటు ఇతర నేతలతో ఆయన చాలా సన్నిహితంగా మెలుగుతారని పార్టీ నాయకులు అంటున్నారు. అయితే మహేశ్ నియామకంలో రేవంత్ కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది.

ఇందూరు జిల్లాకు మరోసారి అవకాశం..

టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించే అవకాశం నిజామాబాద్ జిల్లా వాసికి మరోసారి అవకాశం వచ్చింది. ఉమ్మడి ఏపీలో ధర్మపురి శ్రీనివాస్ 2004 2008 మధ్య రెండుసార్లు పీసీసీ చీఫ్‌గా పనిచేశారు. ఇప్పుడు జిల్లా నుంచి ఆ పదవి వరించిన రెండో నేతగా మహేశ్ కుమార్ నిలిచారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి నేతగా రికార్డు సృష్టించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముగ్గురు టీపీసీసీ చీఫ్‌లు నియామకం కాగా.. మహేశ్ నాలుగో నేతగా గుర్తింపు పొందారు.

గాంధీభవన్‌లో సంబురాలు.. 

ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ నియామకం పట్ల గాంధీ భవన్‌లో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. కాంగ్రెస్‌లో కష్టపడితే పదవులు దక్కుతాయని చెప్పడానికి మహేశ్ నియాకమమే చక్కటి ఉదాహరణ అంటూ హైకమాండ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ స్వీట్లు పంపిణీ చేశారు.

మహేశ్ కుమార్ గౌడ్ ప్రొఫైల్..

తండ్రి : గంగాధర్ గౌడ్

స్వగ్రామం : రహత్ నగర్ గ్రామం, భీమ్‌గల్ మండలం, నిజామాబాద్

పుట్టిన తేదీ : 1966, ఫిబ్రవరి 24వ తేదీ

చదవు : బీకామ్

రాజకీయ ప్రస్థానం : ఎన్‌ఎస్‌యూఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు(1986-1990)

ఉమ్మడి ఏపీ ఎన్‌ఎస్‌యూఐ ప్రెసిడెంట్( 1990-1998)

జాతీయ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ( 1998-2000)

ఏపీ పీసీసీ కార్యదర్శి ( 2000-2003)

పీసీసీ అధికార ప్రతినిధి ( 2012-2016)

పీసీసీ జనరల్ సెక్రటరీ (2016-2021)

కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్(2018)

                                 టీపీసీసీ ఎన్నికల కమిటీ సభ్యుడు(2023)

ప్రస్తుతం పదవులు : పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ( 2021 సెప్టెంబర్ )

  శాసన మండలి సభ్యుడు (ఎమ్మెల్సీ)

గతంలో నిర్వహించిన : ఏపీ గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ (2013-2014)

ప్రభుత్వ పదవులు : 1994లో డిచ్‌పల్లి నుంచి తొలిసారి పోటీ చేసి ఓటమి

ఎన్నికల్లో పోటీ : 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి

  రెండోసారి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి

సామాజిక సేవ :  బొమ్మ ఎడ్యూకేషన్ సొసైటీ ప్రెసిడెంట్‌గా సామాజిక సేవ

క్రీడలు : కరాటే బ్లాక్ బెల్ట్ 6వ డాన్ (2006)

తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్

శుభాకాంక్షలు వెల్లువ

పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్‌ను నియమించడంపై మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, రాష్ర్ట ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, జగ్గారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు  హర్షం వ్యక్తం చేశారు. ఎన్‌ఎస్‌యూఐ నుంచి పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగిన మహేశ్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడంలో ఆయన కీలకంగా పని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు. మహేశ్ నేతృత్వంలో పార్టీ మరింత బలపడుతుందని ఆకాంక్షించారు. పార్టీలో బలహీన వర్గాలకు సముచిత స్థానం ఇస్తారని ఆశిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.



అంకిత భావంతో పనిచేస్త..

నాపై అత్యంత నమ్మకంతోటీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన అధిష్ఠానానికి ధన్యవాదాలు. నా నియామకానికి సహకరించిన ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు.హైకమాండ్ అప్పగించిన ఈ బాధ్యతలను చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేస్తా. నిరంతరం కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీ పటిష్ఠతకు పాటు పడతా.

 పీసీసీ ప్రెసిడెంట్ 

మహేశ్ కుమార్ గౌడ్