calender_icon.png 26 October, 2024 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధరణి ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడిగా మహేశ్ ఎన్నిక

12-08-2024 01:16:12 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 11 (విజయక్రాంతి): తెలంగాణ ధరణి ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ కొనగాల మహేశ్ ఎన్నికయ్యారు. ఆదివారం హోటల్ ప్లాజాలో ధరణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల అధ్యక్షులు, ధరణి కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ.. ధరణి పేరుతో కేసీఆర్ కుటుంబసభ్యులు రూ.లక్షల కోట్ల విలువైన భూములు దోచుకున్నారని ఆరోపించారు. కానీ, ధరణి ఉద్యోగులు 11 నెలల జీతాలు లేక పస్తులున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఖజానా నుంచి ఒక్కొక్క ఉద్యోగి పేరిట రూ.29 వేలు చెల్లించగా, థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా కేవలం రూ.12 వేలు మాత్రమే జీతాలుగా చెల్లించారని మండిపడ్డారు.

రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు కాగానే ఫిబ్రవరి మాసంలో 9 నెలల పెండింగ్ బకాయిలను ఒకేసారి విడుదల చేశారని చెప్పారు. ధరణి రిజిస్ట్రేషన్లు, ప్రజాపాలన దరఖాస్తులు, స్పెషల్ డ్రైవ్ దరఖాస్తులు, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను గత ప్రభుత్వం విస్మరించిందన్నారు. విధులు నిర్వహిస్తూ చనిపోయిన ఉద్యోగులకు కనీస సహాయం అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు కూడా మంజూరు చేయలేదని, ఇంత అమానవీయంగా కేసీఆర్ ప్రభుత్వం ధరణి ఉద్యోగులతో వ్యవహరించిందని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో ధరణి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధరణి ఉద్యోగ సంఘ నాయకులు పురుషోత్తం, శివ, హిమేశ్ తదితరులు పాల్గొన్నారు.