calender_icon.png 29 October, 2024 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీసీసీ పీఠంపై మహేశ్

16-09-2024 12:59:39 AM

  1. గాంధీభవన్‌లో అట్టహాసంగా కార్యక్రమం
  2. సీఎం, మంత్రులు సహా నేతలంతా హాజరు
  3. గన్‌పార్కు వద్ద అమరవీరులకు నివాళులు

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): పీసీసీ నూతన అధ్యక్షుడిగా బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గాంధీభవన్‌లో అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, పార్టీ అగ్రనేతలు, కార్యక ర్తల సమక్షంలో పార్టీ అధ్యక్షుడి పదవి చేపట్టారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ౩.౧౬ నిమిషాలకు ఆయన బాధ్యతలు చేపట్టారు. అం తకుముందు సీఎం రేవంత్‌రెడ్డి పీసీసీ పదవి నుంచి తప్పుకొన్నారు.

ఆ తర్వాత పార్టీ జెండాను రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా మహేష్‌కుమార్‌గౌడ్ స్వీకరించారు. నూతన పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన మహేష్‌కుమార్‌గౌడ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, తుమ్మల నాగేశ్వర్‌రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, షబ్బీర్‌అలీతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ సీనియర్లు అభినందనలు తెలిపారు.

భారీ ర్యాలీ.. గన్‌పార్కు వద్ద నివాళులు 

పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించటానికి ముందు మహేష్‌కుమార్‌గౌడ్ వివిధ జిల్లాల నుంచి వచ్చిన వేలమంది కార్యకర్తలు, అభిమానులతో హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. నార్సింగిలోని తన నివాసంలో టీటీడీ వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం ఇచ్చారు. ఆ తర్వాత దాదాపు 500 కార్లతో ఉదయం 11:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1:40 గంటలకు గన్‌పార్కు వరకు ర్యాలీగా వచ్చి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.

అక్కడి నుంచి వివిధ కళా రూపాలు., బతుకమ్మ, ఆదివాసీ నృత్యాల ప్రదర్శనతో ర్యాలీగా గాంధీభవన్‌కు 2:45 నిమిషాలకు చేరుకున్నారు. అప్పటికే గాంధీభవన్‌కు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నాయకులు కార్యకర్తలు కొత్త పీసీసీ చీఫ్‌కు ఘన స్వాగతం పలికారు.  

వీపు చింతపండే

  1. మా జోలికొస్తే అంతే.. 
  2. పీసీసీ చీఫ్ సౌమ్యుడని అనుకోవద్దు
  3. కాంగ్రెస్ కార్యకర్తలు, పీసీసీ చీఫ్ వెనుక నేనున్నా
  4. తెలంగాణలో మరో పదేండ్లు మాదే అధికారం
  5. 2029 పార్లమెంట్ ఎన్నికలే మనకు ఫైనల్ 
  6. వచ్చే పంట నుంచి సన్న వడ్లకు 500 బోనస్ 
  7. మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రమాణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్,సెప్టెంబర్ 15 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే వీపు చింతపండు అవుతుందని ప్రతి పక్ష పార్టీలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కొత్తగా పీసీసీ అధ్యక్షు డిగా నియమితులైన మహేశ్‌కుమార్‌గౌడ్ సౌమ్యుడు అని తేలిగ్గా తీసుకోవద్దని, ఆయన వెనుక తాను ఉన్నానని తేల్చి చెప్పాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేశారని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారిని గెలిపించేందుకు పీసీసీ చీఫ్, తాను బాధ్యత తీసుకొంటామని ప్రకటించారు.

పీసీసీ చీఫ్‌గా నియమితులైన మహేశ్‌కుమార్‌గౌడ్ గాంధీ భవన్‌లో ఆదివారం బాధ్యత లు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే పీసీసీ అధ్యక్షునిగా బలహీన వర్గాలకు చెందిన మహేష్‌ను పార్టీ అధిష్ఠానం నియమించిందని తెలిపారు. కొత్త పీసీసీ అధ్యక్షుని ఆధ్వర్యంలోనే ప్రభు త్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్తామని చెప్పారు. 

అసలు పోరు ముందే ఉన్నది

ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చి దిద్దాలంటే పార్టీ కోసం పూర్తి సమయాన్ని కేటా యించే వారికి బాధ్యతలు అప్పగించాలని అధిష్ఠానం పెద్దలను కోరినట్లు సీఎం పేర్కొన్నారు. ‘మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు సెమీ ఫైనల్స్ మాత్రమే. 2029లో జరిగే పార్లమెంట్ ఎన్నికలే  ఫైనల్స్. ఢిల్లీలో ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురేసి రాహుల్‌గాంధీని ప్రధాని చేసినప్పుడే ఫైనల్స్ గెలిచినట్లు. 1994 నుంచి రాష్ట్రంలో ప్రతీ ఎన్నికల్లో ఒక్కో పార్టీ వరసగా పదేళ్లు అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ కూడా కచ్చితంగా మరోసారి అధికారంలోకి వచ్చి పదేళ్లు అధికారంలో ఉంటది.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 పార్లమెంట్ స్థానాలు గెలిస్తేనే ఫైనల్స్‌లో గెలిచినట్లు. ఇప్పటి నుంచి కార్యకర్త నుంచి నాయకుల వరకు ఎవరూ విశ్రమించొద్దు’ అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాబోయే మూడు, నాలుగు నెలల్లో బీసీ కుల గణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని, కార్యకర్తలను గెలిపించాల్సిన బాధ్యత మా నాయకులపై ఉందని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కంటే ఎక్కువగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తల కోసం కష్టపడుతామని హామీ ఇచ్చారు.

పార్టీని అధికారంలో తీసుకురావడానికి కష్టపడిన వారిని సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్స్, కార్పొరేటర్లుగా గెలిపించుకుని ఎంపీపీ, జిల్లా, మున్సిపల్ చైర్మన్‌తో పాటు మేయర్ పదవుల్లో కూర్చోపెడుతామని తెలిపారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్‌రెడ్డి వివాదంపై సీఎం స్పందిస్తూ..‘కొంత మంది సన్నాసులు మనవాళ్ల ఇంటికి వస్తాం అన్నారు. కానీ మన వాళ్లే వారికి ఇంటికి వెళ్లారు. ఇంటికి రమ్మన్నవాడు.. మన కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేశారు. ఇప్పుడు మా మీద దాడి చేశారని అంటున్నాడు. మా కార్యకర్తలు ఎవరి జోలికి పోరు.. ఎవరైనా మా మంచి తనాన్ని చేతగాని తనంగా తీసుకుంటే వీపు చింతపండు అవుతుంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ సౌమ్యుడు అని అనుకోవద్దు. ఆయన వెనుకాల నేను ఉన్నాను’ అని సీఎం హెచ్చరించారు. 

రాజీనామా చేస్తానన్న సన్నాసి ఎక్కడ దాక్కుండు? 

మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలనే నినాదంతో ఒక వైపు నేను.. మరో వైపు భట్టి విక్రమార్క పల్లె పల్లెనా పాదయాత్ర చేశామని, ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘దూలం లెక్క పెరిగిన ఒక సన్నాసి  పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ రూ.2 లక్షలు చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. మేం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15న రూ.2 లక్షల రుణమాఫీ చేశాం. అప్పుడు రాజీనామా చేస్తానని చెప్పిన సన్నాసి ఇప్పుడు ఎక్కడ దాక్కుండు’ అని బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావును ఉద్దేశించి   ఘాటుగా వ్యాఖ్యా నించారు.

వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశామని, 23 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు జమ చేసి.. వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించామని, ఇదీ కాంగ్రెస్ పార్టీ నిబద్ధత అని సీఎం పేర్కొన్నారు. వచ్చే పంట నుంచి సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన సభలో సోనియాగాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు.

అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షల వరకు పెంపు హామీలను అమలు చేశామని వివరించారు. ఇప్పటివరకు 85 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేశారని, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకంతో పేదలకు మంచి వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టామని, 200 యూనిట్ల ఉచిత కరెంట్‌తో పేదల ఇండ్లలో వెలుగులు చూస్తున్నామని, రూ.500లకు గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని తెలిపారు. 

మరిన్ని ఉద్యోగాల భర్తీ 

కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని పాదయాత్రలో చెప్పామని.. వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టిన మూడు నెలల్లోనే నిరుద్యోగులకు 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ వెల్లడించారు. మరో 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని, మొదటి ఏడాదిలోనే 65 వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో ఏదీ లేదని, ఆ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఒలింపిక్స్‌లో ఒక్క పథకం రాకపోవడం అవమా నకరమని అన్నారు.

‘నిరుద్యోగులకు నైపు ణ్యం అందించేందుకు యంగ్ ఇండియా యూనివర్సిటిని ఏర్పాటు చేశాం. 2028లో ఒలింపిక్స్‌లో దేశం తరపున బంగారు పథకాలు సాదించే బాధ్యత తెలంగాణ ప్రభు త్వం తీసుకుంటుంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే దిశగా ప్రయత్నం చేస్తు న్నాం. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో ముచ్చెర్లలో ఫోర్త్ సిటీ.. ప్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తాం’ అని తెలిపారు.

ఇంద్రవెల్లి నుంచే సమరశంఖం పూరించి.. 

కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని రేవంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పటికి అధికారంలోకి రాలేదని,  2021 జూన్ 27న పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధిష్ఠానం తనను నియమించగా.. జూలై 7న బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇంద్రవెళ్లి నుంచి దళిత, గిరిజన దండోరా పేరుతో  సమరశంఖం పూరించి.. వెనక్కి తిరిగి చూడకుండా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. దాదాపు 38 నెలల పాటు పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని ముందుకు తీసుకెళ్లానని పేర్కొన్నారు. 

సామాన్య కార్యకర్తగానే ఉంటా: మహేశ్

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటికి ఒక సామాన్య కార్యకర్తగానే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పని చేస్తానని కొత్త పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నెలకో సారి గాంధీభవన్‌కు రావాలని, మంత్రులు కూడా వారంలో ఇద్దరు చొప్పున గాంధీభవన్‌కు వచ్చి పార్టీ కార్యకర్తల బాధలు తెలుసుకో వాలని కోరారు. గాంధీభవన్ తనకు దేవాలయమని, సోనియా గాంధీ దేవత అని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎంత కష్టపడినా ఒక్క శాతమైనా అదృష్టం ఉండాలని, తనకు అదృష్టం ఉండబట్టే ఎమ్మెల్సీ పదవి, ఇప్పుడు పీసీసీ చీఫ్ పదవి వచ్చిందని తెలిపారు.

తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని అనుకోలేదని, ఇప్పటివరకు పార్టీ కోసం పని చేసుకుంటూ వెళ్లానని చెప్పారు. గాంధీభవన్‌తో 40 ఏళ్ల అనుబందం ఉందని, అయినప్పటికీ ఇన్ని రోజులు పదవులు ఎందు కు రాలేదని తానెప్పుడూ అనుకోలేదని అన్నారు. ఇద్దరు విభిన్నమైన వ్యక్తుల కోసం పని చేశానని, వారిలో ఒకరు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరొకరు రేవంత్‌రెడ్డి అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోనే ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని, నాయకుల మధ్య విబేధాలున్నా.. ఎన్నికల ముందు వాటిని పక్కనపెట్టి అందరం కలిసి తిరగడంతోనే అధికారంలోకి వచ్చామని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ నాయకులందరినీ సమన్వయం చేయాల్సి వచ్చిందని, ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయిందని, అందరు కలిసి పని చేస్తున్నారని పేర్కొన్నారు. సోనియాగాంధీ తెలంగాణ ఇస్తేనే.. కేసీఆర్ కుటుంబం అధికారంలోకి వచ్చిందని అన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలతోనే ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అనుచరులు అతడి ఇంటి వద్దకు వెళ్లారని, మనది రాయలసీమ కాదని తెలిపారు.

కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణ భాష మారిపోయిందని, కేసీఆర్ మాట్లాడే భాషకు రేవంత్‌రెడ్డి భాషతో సమాధానం చెప్పారని, అందుకే మనం అధికారంలోకి వచ్చామని తెలిపారు. గాంధీభవన్‌లో నిత్యం 6 గంటలు అందుబాటులో ఉంటానని చెప్పారు. ‘నాకు భేషజాలు లేవు. గాంధీభవన్‌లో పవర్ సెంటర్ ఉండదు. రాహుల్ గాంధీ ఒక్కరే పవర్ సెంటర్’ అని పేర్కొన్నారు. కమ్యూనిష్టు పార్టీలకు ఉన్న ఆస్తులు ఇతర పార్టీలకు లేవని, కాంగ్రెస్‌కు కూడా జిల్లాల్లో పార్టీ కార్యాలయాల కోసం స్థలాలు కేటాయించాలని సీఎంను కోరారు.  

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి 

కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షే మం, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్తపై ఉందని పీసీసీ చీఫ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుందని, అందుకు తానే సాక్ష్యమని పేర్కొన్నారు.  అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే రైతు రుణమాఫీ కోసం రూ.18 వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఎక్కడా లేదని తెలిపారు. బీఆర్‌ఎస్ నాయకులు సోషల్ మీడియాను సోషల్ సెన్స్ లేకుండా వాడుతున్నారని విమర్శించారు. 

హైడ్రా ఏర్పాటు చారిత్రాత్మక నిర్ణయమని, హైదరాబాద్ ఒక రాక్స్ అండ్ లేక్స్ సిటీ అన్నారు. హైడ్రాను హైదరాబాద్‌కే కాకుండా జిల్లాలకు విస్తరించాలని కోరారు. తెలిసో, తెలియకనో చెరువుల దగ్గర ఇళ్లు కొన్న పేద వాళ్లకు వేరే దగ్గర ఇళ్లు కట్టించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పీసీసీ చీఫ్, పార్టీ శ్రేణులపై ఉందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ అన్నారు.

పార్టీ బాధ్యలను మహేష్‌కుమార్‌గౌడ్‌కు అప్పగించి అధిష్ఠానం మంచి నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. కొన్ని విషయాల్లో తాను కొంత కఠినంగానే ఉంటానని, అదేవిధంగా పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని గౌరవిస్తానని తెలిపారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీకి, నేతలకు సవాల్ వంటివని అన్నారు. బీజేపీ మతతత్వ రాజకీయాలపై పోరాడాలని అందరం సంకల్పం తీసుకుందామని పిలుపునిచ్చారు.