హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో తనను గెలిపించుకోవాలని ప్రజలు ముందే నిర్ణయించుకున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపి అభ్యర్థిగా పోటీ చేసిన అరుణ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. మోడీ అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రజలు నాకు ఓటేశారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు పేదలకు అందుతున్నాయని పేర్కొన్నారు. తమ కార్యకర్తలను చాలా మంది బెదిరించారని అరుణ వెల్లడించారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా బిజెపి కార్యకర్తలు వెనక్కి తగ్గలేదని ఆమె పేర్కొన్నారు. నిన్న జరిగిన పోలింగ్ లో అధిక మెజార్టీతో గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ గెలుపు కాషాయ పార్టీదేనని జోస్యం చెప్పారు. తమ పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడ్డారని డీకే అరుణ పేర్కొన్నారు. నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావాలని పార్టీలకు అతీతంగా చాలామంది ప్రజలు ఓటేశారని వెల్లడించారు. నరేంద్ర మోడీ మూడోసారి దేశానికి ప్రధాని అవుతారని డీకే అరుణ స్పష్టం చేశారు.