- ఎన్డీయేకే మహారాష్ట్ర ప్రజల మద్దతు
- అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ
- కాబోయే సీఎంపై ఉత్కంఠ
- అందరిచూపు దేవేంద్ర ఫడ్నవీస్ పైనే..
దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపారు. గతంలో కన్నా ఘనంగా మహాయుతి కూటమికి భారీ మెజారిటీ అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తిస్థాయి ఆధిక్యాన్ని ఎన్డీయే కూటమి సాధించింది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మహావికాస్ అఘాడీ వెనుకంజలోనే ఉంది.
మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి గెలుపు నేపథ్యంలో బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పైనే అందరి దృష్టి ఉంది. ఈ మేరకు మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిని తేల్చేందుకు బీజేపీ కేంద్ర పరిశీలకులు ముంబై చేరుకోనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని మొత్తం 288 సీట్లకు గాను ఎన్డీయే కూటమి 23౪ సీట్లను కైవసం చేసుకుని క్లియర్ మెజారిటీ సాధించింది.
132 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. తర్వాతి స్థానంలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 57 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఎన్సీపీ (అజిత్ పవార్) 41 సీట్లు కైవసం చేసుకుంది. మరోవైపు ఈసారి తమదే అధికారమని భావించిన మహావికాస్ అఘాడీ కూటమి మాత్రం 50 సీట్లకే పరిమితమైంది. శివసేన (యూబీటీ) 20, కాంగ్రెస్ 16, ఎన్సీపీ (ఎస్పీ) 10, ఎస్పీ 2 స్థానాలకే పరిమితమయ్యాయి.
అభివృద్ధే మా ఎజెండా
ముంబై: మహారాష్ట్ర ప్రజలు అభివృద్ధిని విశ్వసించారు తప్ప అబద్దాలను కాదని మహాయుతి నేతలు అన్నారు. ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించిన షిండే, ఫడ్నవీస్, పవార్ మాట్లాడుతూ.. ఇది చారిత్రాత్మక విజయం అన్నారు. తమ కూటమిపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోమని తెలిపారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే మహా వికాస్ అఘాడీ సృష్టించిన అడ్డంకులను చేధించామన్నారు. మహా ప్రజలు మోదీ వెంటే ఉన్నారని మరోసారి రుజువైందన్నారు. ప్రతిపక్షాల అసత్యాలను ప్రజలు విశ్వసించలేదని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం సమతూకంగా ముందుకెళ్తామని వెల్లడించారు.
సీఎం పదవిపై వివాదం లేదు..
‘తదుపరి సీఎం ఎవరనేది మహాయుతి నేతలు నిర్ణయిస్తారు. మూడు పార్టీలకు చెందిన నేతలు కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. సీఎం పదవి విష యంలో ఎటువంటి వివాదం లేదు’
దేవేంద్ర ఫడ్నవీస్
అభివృద్ధికే పట్టం కట్టారు
ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. ఇది చారిత్రాత్మక విజయం. ఇంతటి ఘన విజయం అందించిన ఓటర్లకు ధన్యవాదాలు. కార్యకర్తలు ప్రజల మధ్య పనిచేయాలని బాలాసాహెబ్ ఎప్పుడూ చెప్పేవారు. ఆయన మా టలను మేము పాటిస్తూ వస్తున్నాం’
- ఏక్‌నాథ్ షిండే
వాళ్లు ఓటమిని జీర్ణించుకోవటం లేదు
‘మహాయుతి విజయంలో లడ్కీ బహీన్ పథకం కీలకపాత పోషించింది. ఓటమిని జీర్ణించుకోలేని కొంత మంది బ్యాలెట్ ఓటింగ్ అంటూ ఈవీఎంలను తప్పుబడుతున్నారు. మరి మేము జార్ఖండ్‌లో ఓడిపోయాం కదా..’
అజిత్ పవార్